Cotton Yield: పత్తి దిగుబడి వట్టిదేనా?
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:55 AM
తొలకరిలో పత్తిసాగు మొదలు పెట్టిన దశలోని ఉత్సాహం ఇప్పుడు రైతుల్లో కాస్తయినా లేదు. ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఏమాత్రం లేకపోవడంతో పంట పెట్టుబడి కోసం చేసిన...
ఎకరానికి 3-4 క్వింటాళ్ల మేర పడిపోయే అవకాశం
నాణ్యత లేమి, తేమ కారణంగా మద్దతు ధరా హుళక్కే
పెట్టుబడి అయినా చేతికి వస్తుందా?.. రైతుల్లో ఆందోళన
ఎడతెగని వర్షాలు, వరదలతో పత్తి పంటకు తీవ్ర నష్టం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
తొలకరిలో పత్తిసాగు మొదలు పెట్టిన దశలోని ఉత్సాహం ఇప్పుడు రైతుల్లో కాస్తయినా లేదు. ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఏమాత్రం లేకపోవడంతో పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి? అనే దిగులు పట్టుకుంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు, ముసురు, మబ్బుపట్టిన వాతావరణం కారణంగా రాష్ట్రంలో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. అప్పట్లో చేలల్లో వేసిన విత్తనాలు చక్కగా మొలకెత్తినా.. కొత్త చిగుళ్లతో మొక్క బాగా ఎదిగే దశలో మొదలైన వర్షం అదేపనిగా కురుస్తుండటమే సమస్యగా మారింది. మొక్కల్లో ఎదుగుదల లోపించింది. కాయలు కాసే దశలో ఆకులు పండుబారిపోతున్నాయి. చేలల్లో రోజుల తరబడి వరద నీరు కారణంగా మొక్కలు జాలు పట్టాయి. నీరుచేరి బూజు పట్టి డొల్లగా మారుతున్న కాయలు రాలిపోతున్నాయి. కొన్నిచోట్ల కాయలు చక్కగా విచ్చుకున్నా వదలని చినుకులకు దూది పింజలు తడిసి నల్లబారుతున్నాయి. వానకు తోడు మబ్బుపట్టిన వాతావరణం కారణంగా తెగుళ్లు పట్టిపీడిస్తుండటం, కలుపు మొక్కలు కప్పేస్తుండటంతో పంటంతా నాశనమవుతోంది. ఎక్కువగా నల్లరేగడి భూముల్లో పత్తిసాగు చేస్తుండటంతో వరుస వర్షాలతో ఆ చేలల్లో తేమ వదలడం లేదు. ఫలితంగా మొక్కలు నిలువునా మురిగిపోతున్నాయి. ఈ పరిస్థితి అంతా దిగుబడిపై ప్రభావం చూపనుంది. సాధారణంగానైతే మంచి వాతావరణ పరిస్థితులు ఉంటే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల మేర దిగుబడి రావాలి. తాజా పరిస్థితుల కారణంగా ఇది 5-6 క్వింటాళ్లకే పరిమితమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలాచోట్ల 3-4 క్వింటాళ్ల మేర దిగుబడి పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తామర, ఎర్రనల్లి, ఎర్ర తెగుళ్లతో పత్తిచేలు ఎర్రబారుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఏడాది 6.42 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగవగా.. ఈసారి 7.61 లక్షల ఎకరాల్లో వేశారు. అయితే చీడపీడల వల్ల జిల్లాలో ఎకరాకు 3-4 క్వింటాళ్ల మేర దిగుబడి తగ్గే అవకాశం ఉంది. నారాయణపేట జిల్లా పూత, కాత రాలుతోతోంది. హనుమకొండ జిల్లా గత ఏడాది ఎకరానికి 9క్వింటాళ్లపైనే దిగుబడి వచ్చింది. ఈసారి 2-3 క్వింటాళ్లు తగ్గుతుందని చెబుతున్నారు.. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 14వేల ఎకరాల్లో పంట ఎందుకూ పనికిరాకుండాపోయింది. ఆసిఫాబాద్ జిల్లాలో 10వేల ఎకరాల్లో, మంచిర్యాల జిల్లాలో 3వేల ఎకరాల్లో పంట దెబ్బతింది.
మద్దతుకు సీసీఐ కొర్రీలు పెట్టనుందా?
పత్తిపంటకు మద్దతు ధరను ఈసారి క్వింటాకు రూ.8,110గా నిర్ణయించారు. వర్షాలు, వరదలు, చీడపీడల సమస్య కారణంగా పత్తి నాణ్యత బాగా దెబ్బతింది. పైగా తేమ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠంగా 8-12 శాతం తేమనే సీసీఐ అనుమతిస్తోంది. అంతకుమించి తేమ ఉంటే మద్దతు ధర ఇవ్వడం లేదు. 12శాతానికి మించి తేమ ఉంటే.. ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్కశాతానికి రూ.81 చొప్పున తగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే పత్తిరైతులకు మద్దతు ధర లభించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకున్నా.. మార్కెట్లకు మాత్రం పత్తి తరలుతోంది. అయితే క్వింటాకు రూ.5వేల నుంచి రూ.7వేల వరకే రైతులకు ఇస్తున్నారు.
కొనుగోళ్లు ఆలస్యం?
రాష్ట్రవ్యాప్తంగా ఈసారి పత్తిసాగు స్వల్పంగా పెరిగింది. రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 48,93,016 ఎకరాలు. గత ఏడాది 44,75,352 ఎకరాల్లో పత్తిసాగైంది. ఈసారి 45,94,684 ఎకరాల్లో సాగైంది. అయినా సాధారణ సాగు విస్తీర్ణంలో ఇది 93శాతమే! ఈసారి యూరియా కొరత వల్ల పంటలో ఎదుగుదల లోపించింది. పైగా వర్షాలు, వరదలు, తెగుళ్ల కారణంగా దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉందని అంచనాలున్నాయి. పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేపనిలో పడింది. దసరా తర్వాత రాష్ట్రంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే లీజు టెండర్ల విషయం కొలిక్కిరాకపోవడంతో కొనుగోళ్లు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు జిన్నింగ్ మిల్లులను లీజుకు తీసుకునేందుకుగాను సీసీఐ టెండర్లు ఆహ్వానించింది. అయితే సీసీఐ నిబంధనలపై అభ్యంతరాలు ఉండటంతో వ్యాపారులు ముందుకు రావడం లేదు. క్వింటా పత్తి నుంచి 33శాతం దూది (లింట్) తీయాలనే నిబంధన ఉంది. దీనిపై వ్యాపారులు, ట్రేడర్స్ మధ్య విభేదాలున్నాయి. ఫలితంగా కొనుగోలు కేంద్రాలు దీపావళికి ప్రారంభమైనా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.