Share News

kumaram bheem asifabad- తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Nov 06 , 2025 | 10:34 PM

సీసీఐ కేంద్రంలో తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కుమరం భీం జిల్లా వాంకిడిలోని జీవీపీ ఆగ్రో జిన్నింగ్‌ మిల్లు ఎదుట జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేశారు.

kumaram bheem asifabad- తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలి
కుమరం భీం జిల్లా వాంకిడిలో ఆందోళన చేస్తున్న రైతులు

వాంకిడి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): సీసీఐ కేంద్రంలో తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కుమరం భీం జిల్లా వాంకిడిలోని జీవీపీ ఆగ్రో జిన్నింగ్‌ మిల్లు ఎదుట జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేశారు. జిన్నింగ్‌ మిల్లులో సీసీఐ ద్వారా కొనుగోళ్లు బుధవారం ప్రారంభం కావడంతో 56 మంది రైతులు పత్తి విక్రయించేందుకు కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు రైతులు వాహనాల్లో పత్తిని నింపుకుని మిల్లుకు తీసుకు వచ్చారు. కేవలం పది పత్తి వాహనాలకు తేమ శాతాన్ని పరిశీలించారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, 12 శాతం మించితే పత్తి కొనుగోలు చేయలేమని సీపీవో (పత్తి కొనుగోలు అధికారి) తేల్చి చెప్పారు. సీసీఐ ద్వారా పత్తి విక్రయించేందుకు ఎంతో ఆశతో వస్తే తేమపేరుతో కొనుగోలు చేయకుండా వెనక్కి పంపించడం ఎంతవరకు సమంజసమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిన్నింగ్‌ మిల్లు ముందు జాతీయ రహదారిపై ఆందో ళనకు దిగారు. సుమారు మూడు గంటల పాటు రహదారిపై బైఠాయించారు. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి పంట దెబ్బతిని పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితులు లేని సమయంలో సీసీఐ అధికారులు నిబంధనలు విధించడం సరైంది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్లాట్‌ బుక్‌ చేసి సీసీఐ కేంద్రానికి తీసుకువచ్చిన పత్తిని కొనుగోలు చేసేంతవరకు ఆందోళన విరమించేది లేదని చెప్పారు. ఎస్సై మహెందర్‌, తహసీల్దార్‌ కవిత, వ్యవసాయ అధికారి గోపికాంత్‌ రైతులతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చూస్తామని చెప్పినా రైతులు వినిపించుకోలేదు. అనంతరం సీపీవో కిరణ్‌దేశ్‌ముఖ్‌ను పిలిపించి సీసీఐ ఉన్నతాధికారు లతో రైతులను మాట్లాడించారు. తేమ శాతం నిబంధన కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఉంటుందని, ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించేలా చూస్తామని సీసీఐ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వాంకిడి మాజీ సర్పంచు బండె తుకారం, ఆరే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జెరాం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దీపక్‌ముండే, సీపీఎం రెడ్‌స్టార్‌ పార్టీ జిల్లా నాయకుడు గోగర్ల తిరుపతి, రైతులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని జీవీపీ ఆగ్రో జిన్నింగ్‌ మిల్లు ముందు జాతీయ రహదారిపై రైతులు చేపట్టిన రాస్తారోకో కార్యక్రమంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మూడు గంటల పాటు రాస్తారోకో చేయడంతో రెండు కిలోమీటర్ల మెర ఇరుపక్కల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జిన్నింగ్‌ మిల్లు సమీపంలో హోటళ్లు లేకపోవడంతో మంచినీటి కోసం బస్సుల్లో ఉన్న ప్రయాణికులు, వాహన డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురైనారు. రైతులు మూడు గంటల పాటు ఎండలో ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - Nov 06 , 2025 | 10:34 PM