Share News

Minister Tummala Nageswara Rao: నేడు పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:08 AM

కాటన్‌, జిన్నింగ్‌ మిల్లర్లతో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం జరిపిన చర్చలు ఫలించాయి. పలు డిమాండ్లతో పత్తి కొనుగోళ్లు నిలిపివేసిన జిన్నింగ్‌ మిల్లర్లు...

Minister Tummala Nageswara Rao: నేడు పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం

  • జిన్నింగ్‌ మిల్లర్లతో తుమ్మల చర్చలు సఫలం

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కాటన్‌, జిన్నింగ్‌ మిల్లర్లతో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం జరిపిన చర్చలు ఫలించాయి. పలు డిమాండ్లతో పత్తి కొనుగోళ్లు నిలిపివేసిన జిన్నింగ్‌ మిల్లర్లు... బుధవారం కొనుగోళ్లను పునఃప్రారంభించేందుకు అంగీకరించారు. సచివాలయంలో సీసీఐ సీఎండీ లలిత్‌ కుమార్‌ గుప్తా, జిన్నింగ్‌ మిల్లర్ల అసోషియేషన్‌ ప్రతినిధులతో మంత్రి తుమ్మల మావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో జన్నింగ్‌ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్‌ ప్రతినిధులు వివరించారు. మిల్లర్లు సమ్మెకు దిగితే రైతుల సమస్యలు రెట్టింపు అవుతాయని, ఇలాకాకుండా సామరస్యంగా కేంద్రంతో పోరాడుదామని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తుమ్మల పేర్కొన్నారు. జిన్నింగ్‌ మిల్లర్ల సమస్యలపై నివేదిక తయారుచేసి... కేంద్ర జౌళిశాఖకు పంపించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ను మంత్రి ఆదేశించారు. కేంద్రం తీసుకొచ్చిన కపాస్‌ కిసాన్‌ యాప్‌, మొబైల్‌ ఓటీపీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తుమ్మల అన్నారు. ఒకవేళ యాప్‌లో నమోదు చేసుకున్నప్పటికీ... సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకెళ్తే ఇప్పుడు 7 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటున్నారని అన్నారు. మునుపు 12 క్వింటాళ్లు తీసుకునేవారని, ఫలితంగా మిగిలిన 5 క్వింటాళ్లు ఎక్కడ అమ్ముకోవాలో రైతులకు అర్థం కావటంలేదని పేర్కొన్నారు. 8 శాతం నుంచి 12 శాతం వరకు తేమ ఉంటేనే సీసీఐ పత్తి తీసుకుంటున్నదని, అకాల వర్షాలు, మొంథా తుఫానుతో పత్తి పంట దెబ్బతిన్నదని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా తేమ నిబంధనను సఢలించకపోవటం ఆందోళన కలిగిస్తోందన్నారు. జిన్నింగ్‌ మిల్లులను ఎల్‌-1, ఎల్‌-2 గా విభజించటంతో కొన్ని మిల్లుల్లో కొనుగోళ్లు జరగటంలేదని, కేంద్ర ప్రభుత్వం, సీసీఐ నిబంధనలు పత్తి రైతులకు శాపంగా మారాయని అన్నారు. అయితే జిన్నింగ్‌ మిల్లర్లు తమ సమస్యలపై కేంద్రంతో పోరాడాలని, రైతులను ఇబ్బందిపడితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని, జిన్నింగ్‌ మిల్లర్లతో చర్చలు జరిపి పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తే... తాము ప్రశ్నిస్తేనే ఇదంతా జరిగినట్లు బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారని తుమ్మల విమర్శించారు. మొక్కజొన్న కొనుగోళ్ల పరిమితిని 18 క్వింటాళ్ల నుండి 25 క్వింటాళ్లకు పెంచినట్లు తుమ్మల తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాఫెడ్‌ సేకరించే 25శాతం సోయా చిక్కుడు పరిమితిని కూడా ఎకరానికి 6.72 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్లకు పెంచి సేకరించాల్సిందిగా మార్క్‌ఫెడ్‌ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కౌలు రైతులకు ఇబ్బందులు కలగకుండా నాఫెడ్‌ తీసుకొచ్చిన ఆధార్‌ బయోమెట్రిక్‌తోపాటు మొబైల్‌ ఓటీపీతో కూడా కొనుగోళ్లు జరపాలని మార్క్‌ ఫెడ్‌ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు తుమ్మల తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కానుకగా ఈ చీరలు పంపిణీ చేస్తోందని తెలిపారు.

Updated Date - Nov 19 , 2025 | 05:08 AM