Share News

Agriculture Minister Tummala Nageswara Rao: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించండి!

ABN , Publish Date - Sep 30 , 2025 | 04:53 AM

రాష్ట్రంలో బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు రాష్ట్ర వ్యవసాయ...

Agriculture Minister Tummala Nageswara Rao: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు  ప్రారంభించండి!

  • పత్తి రైతుకు కనీస మద్దతు ధర దక్కాల్సిందే

  • సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి

  • కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌కు తుమ్మల లేఖ

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం లేఖ రాశారు. పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందేలా సీసీఐ(కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ’’రాష్ట్రంలో ఈ వానాకాలంలో 43.29 లక్షల ఎకరాల పత్తి సాగైంది. సుమారు 24.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తిని అంచనా వేశాం. చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా పత్తి సాగుచేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి. ఈ సీజన్‌లో జాబ్‌ వర్క్‌ చేయటానికి సీసీఐ రెండుసార్లు టెండర్లు పిలిచినా.. జిన్నింగ్‌ మిల్లర్లు టెండర్లలో పాల్గొనలేదు.’’ అని కేంద్రమంత్రి దృష్టికి తుమ్మల తీసుకెళ్లారు. నిరుడు అమలుచేసిన విధానాన్నే ఈసారి కొనసాగించాలని తెలంగాణ కాటన్‌ మిల్లర్లు, ట్రేడర్ల సంక్షేమ సంఘం కోరుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఎల్‌-1, ఎల్‌-2 అలాట్మెంట్లు, లింట్‌ రికవరీ శాతం, జోన్ల వారీగా లింట్‌ శాతం, రైతుల స్లాట్‌ బుకింగ్‌, ఏరియా మ్యాపింగ్‌ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారని మంత్రి లేఖలో పేర్కొన్నారు.

సీసీఐ, మార్కెటింగ్‌ అధికారులు కలిసి పనిచేయాలి

పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించటమే లక్ష్యమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌ ధర ఎమ్మెస్పీ కంటే క్వింటాలుకు రూ. 1,410 చొప్పున తక్కువగా ఉంద న్నారు. క్వింటాలుకు రూ. 8,110 చొప్పున రైతులకు కనీస మద్దతు ధర దక్కాల్సిందేనని చెప్పారు. పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా సీసీఐ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తేమశాతం, నాణ్యత, తూకం, ధరల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా మానిటరింగ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నెంబరు 1800 599 5779, వాట్సప్‌ హెల్ప్‌లైన్‌ నెంబరు 88972 81111 అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సీసీఐ సెంటర్లలో సీసీ కెమెరాలతో పాటు రోజువారీ క్రయవిక్రయాలు పరిశీలించేందుకు డైరెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటుచేయాలన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 04:53 AM