Cotton Purchase Rules Face Farmer Backlash: పత్తి కొనుగోలుపై నిబంధనలు రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:01 AM
పత్తి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం విధించిన రైతు వ్యతిరేక విధానాలను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం నేతలు, పత్తి రైతుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు....
కపాస్ యాప్‌తో కొనుగోలు సరికాదు.. ఎకరాకు 7 క్వింటాలే కొంటామనడం దారుణం: జాన్‌వెస్లీ
రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలి: పత్తి రైతుల సంఘం
యాచారం/ఖిలావరంగల్/వరంగల్ వ్యవసాయం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం విధించిన రైతు వ్యతిరేక విధానాలను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం నేతలు, పత్తి రైతుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్‌లో నిర్వహించిన సీపీఎం జిల్లా వర్క్‌షాప్ లో రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ‘కపాస్ కిసాన్ యాప్’ ద్వారా పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేయాలనే నిబంధనను ఎత్తివేయాలని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొంటామనడం దారుణమని, ఈ నిబంధన ఎందుకు విధించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షాలకు దెబ్బతిన్న పత్తి, వరి పంటల నష్టాన్ని వ్యవసాయశాఖ అధికారులతో సమగ్ర సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని అన్నారు. వరంగల్‌లోని సీసీఐ వరంగల్ రీజినల్ కార్యాలయం ఎదుట తెలంగాణ పత్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కన్వీనర్ చందునాయక్ మాట్లాడుతూ తేమతో సంబంధం లేకుండా సీసీఐ ద్వారా పత్తిని ఎక్కడైనా విక్రయించే అవకాశాన్ని కల్పించాలన్నారు.
17 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్
పత్తి పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కానందున ఈనె 17 (సోమవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ, ప్రైవేటు పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు కాటన్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రైతులు మార్కెట్‌కు పత్తి తీసుకురావద్దని వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు.