Union Minister Giriraj Singh: చివరి కిలో వరకూ పత్తి కొంటాం
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:19 AM
తెలంగాణ పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని.. ఈ ఏడాది రాష్ట్రంలో పండిన పత్తి చివరి కిలో వరకు కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా......
రైతులకు కేంద్రం అండగా ఉంటుంది
పత్తి కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు: గిరిరాజ్‌సింగ్
పత్తిని తక్కువకు అమ్మొద్దు: కిషన్‌రెడ్డి
గిరిజన భాషల్లోనూ బోధన అవసరం: ధర్మేంద్ర ప్రధాన్
సమ్మక్క- సారక్క గిరిజన వర్సిటీ లోగో ఆవిష్కరణ
న్యూఢిల్లీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని.. ఈ ఏడాది రాష్ట్రంలో పండిన పత్తి చివరి కిలో వరకు కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ద్వారా కొనుగోలు చేస్తామని కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్‌సింగ్ చెప్పారు. పత్తిని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. మహారాష్ట్రలోని అకోలాలో పత్తి పండిస్తున్న తరహాలో తెలంగాణలోనూ పండించి అధిక దిగుబడి సాధించేలా రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారు. మంగళవారం ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్‌లో గిరిరాజ్‌సింగ్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భేటీ అయ్యారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలు, కొనుగోలు కేంద్రాల పెంపు, పత్తి రైతులు ఇబ్బందులపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కనీస మద్దతు ధరకు పంటల కొనుగోలుతోపాటు దళారులకు ఆస్కారం లేకుండా నేరుగా రైతులకు లాభం చేకూరేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని గిరిరాజ్‌సింగ్ చెప్పారు. తెలంగాణలో ఏటా సుమారు రూ.65 వేల కోట్ల మేర పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. పత్తిని ఆరబెట్టి, తేమ శాతాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ స్థాయిలో వేదికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం నిధులను వాడుకోవాలని చెప్పారు. కాగా, రైతులు తొందరపడి పత్తిని బయట తక్కువధరకు అమ్ముకోవద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. మార్కెట్‌లోకి రైతులంతా ఒకేసారి పత్తి తీసుకురావడంతో ఇబ్బందులు వస్తున్నాయని.. అందుకోసం ప్రత్యేక యాప్ తెచ్చామని, దానితో ఎవరు, ఎప్పుడు మార్కెట్‌కు రావాలో స్లాట్‌లు కేటాయిస్తారని తెలిపారు.
గిరిజన భాషల్లోనూ బోధన అవసరం: ధర్మేంద్ర ప్రధాన్
దేశంలో గిరిజన భాషల్లోనూ బోధన ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. ములుగులోని సమ్మక్క- సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకురావాలని సూచించారు. మంగళవారం ఢిల్లీలో సమ్మక్క- సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం లోగోను కిషన్‌రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ప్రధాని మోదీ దూరదృష్టి, కిషన్‌రెడ్డి చొరవతో గిరిజన వర్సిటీ సాకారమైందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. భారత ఆయుర్వేదం, గిరిజనుల ఆహారం గురించి కోర్సులు ఉండేలా వర్సిటీ చర్యలు చేపట్టాలన్నారు. ఇక ఈ యూనివర్సిటీ భవనాల నిర్మాణం త్వరితగతిన ప్రారంభించాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు.