Cotton Farmers Face Losses: పొట్ట నింపని పత్తి
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:52 AM
పత్తి రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. పంట సాగు చేసినప్పటి నుంచి అష్టకష్టాలు పడిన రైతన్నలు..
దిగుబడి రాకపోవడంతో చేలు దున్నేస్తున్న పత్తి రైతులు
ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, ఇతర పంటలు
ఖరీఫ్ సీజన్‌లో పత్తి రైతులను ముంచిన అధిక వర్షాలు
దారుణంగా దెబ్బతిన్న పంట.. దిగుబడి లేక దిగాలు
ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లు కూడా రాని వైనం
మొక్కజొన్నతో ఎంతోకొంత గిట్టుబాటు అవుతుందన్న ఆశ
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. పంట సాగు చేసినప్పటి నుంచి అష్టకష్టాలు పడిన రైతన్నలు.. మరిన్ని నష్టాలను భరించలేమన్న విషయాన్ని గ్రహించారు. పత్తితో లాభం లేదనుకొని.. ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల వైపు దృష్టి పెట్టారు. పంటకాలం పూర్తికాకముందే పత్తి చేనును పీకేసి, అదే భూమిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఈ వానాకాలంలో భారీ వర్షాలతో పత్తి పంట దెబ్బతినడం, భవిష్యత్తులో కోలుకొని దిగుబడి వస్తుందనే భరోసా లేకపోవడంతో రైతులు పత్తి మొక్కలు పీకేస్తున్నారు. కొందరు రెండోసారి పత్తి తీశాక మొక్కలను పీకేస్తుండగా.. మరికొందరు ఒక్కసారి పత్తి తీసిన వెంటనే ప్రత్యామ్నాయ పంటను ఎంచుకుంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నల్లరేగడి భూముల్లో వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చెలక నేలలు, తేలికపాటి భూముల్లో 4-5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మధ్యస్థ భూములు అయితే 6-7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పత్తి దిగుబడి సగటు చూస్తే ఎకరాకు 7 క్వింటాళ్ల వరకు ఉంటుంది. కానీ, ఈసారి ఆ పరిస్థితి లేదు. జూన్, జూలైల్లో కాస్త తక్కువ వర్షాలు పడినా, ఆగస్టు నుంచి కుండపోత వర్షాలు కురవడంతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలతో పడే వర్షాలతోపాటు అకాల వర్షాలు, తుపాన్ల ప్రభావంతో పత్తి పంట కోలుకోలేని విధంగా తయారైంది. దిగుబడి పూర్తిగా పడిపోయింది. పత్తి సాగుకు కేంద్రబిందువైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 8-10 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. జిల్లాలో అసాధారణ స్థాయిలో 1,540 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో పత్తి తీవ్రంగా దెబ్బతింది. వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కూడా పత్తి పంట పరిస్థితి ఇలాగే తయారైంది.
ఒకటి, రెండు సార్లు పత్తి తీయగానే..
సాధారణంగా పత్తి పంట ఏడాది పాటు సాగులో ఉంటుంది. జూన్‌లో మొదలైతే మార్చి నెలాఖరు వరకు ఉంచినా పత్తి దిగుబడి వస్తుంది. అయితే, రైతులు జూన్ నుంచి డిసెంబరు వరకు పక్కాగా ఉంచుతారు. జనవరి నుంచి మార్చి వరకు కొందరు రైతులు పత్తి చెట్లు తీసేసి.. ఇతర పంటలు వేస్తుంటారు. మార్చి వరకు పంటను ఉంచి నీళ్లు, ఎరువులు అందిస్తే.. పూత, కాతతో మళ్లీ 3-4 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ ఖరీ్‌ఫలో అలాంటి పరిస్థితి లేదు. నవంబరు మొదటి పక్షంలోనే రైతులు పత్తి చేను తీసేసి, నేలను చదును చేస్తున్నారు. పెద్దగా దిగుబడి రాని పంటను నాలుగైదు నెలలు ఉంచడం ఎందుకన్న ఆలోచనతో పత్తి తీసేస్తున్నారు. వర్షాల తాకిడికి చెట్లు పెరగకపోవడం, ఆకులు ముడతపడడం, కాయలు నల్లబడడంతో పత్తి మొక్కలను తీసేయడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. ఒకటి, రెండు సార్లు పత్తి తీసే స్థాయుల్లోనే చేనును దున్నేస్తున్నారు. అదే భూమిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. కొందరు రైతులు శనగ, పెసర, ఇతర పంటలు కూడా వేస్తున్నారు. సాధారణంగా మొక్కజొన్న సాగుకు ప్రత్యేక సీజనేమీ ఉండదు. నీటి వసతి ఉంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. దీంతో రైతులు పత్తి చేనును తొలగించి, మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని సింహభాగం పత్తి రైతులు ఇదే పని చేస్తున్నారు. పత్తి పంటకు ఎకరానికి రూ.36-46 వేల వరకు పెట్టుబడి ఖర్చవుతోంది. ఆయా జిల్లాల్లో 10 క్వింటాళ్ల దిగుబడి వస్తే తప్ప ఎంతో కొంత మిగిలే పరిస్థితి లేదు. ఇప్పుడు అందులో సగం కూడా దిగుబడి రావడం లేదు.
మూడెకరాల్లో పత్తి తీసి మొక్కజొన్న వేశా
ఈ ఖరీ్‌ఫలో మూడెకరాల్లో పత్తి సాగు చేశా. అధిక వర్షాలకు పంట ఎర్రబారిపోయింది. పత్తి కాయలు నల్లగా మారాయి. ఎకరానికి 3 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. కాలపరిమితి ముగిసేవరకు పంట ఉంచినా లాభం లేదని అనిపించింది. అందుకే పత్తి మొక్కలను పీకేసి, అదే భూమిలో మొక్కజొన్న విత్తనాలు వేశా. పత్తి సాగుతో తీవ్రంగా నష్టపోయా. పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు. పత్తిపంటను దున్నేసి మొక్కజొన్న వేయడం ద్వారా యాసంగిలో అయినా ఎంతో కొంత గిట్టుబాటు అవుతుందని ఆశిస్తున్నా.
- కూరపాటి రమణ, అనంతసాగర్, ఖమ్మం జిల్లా
డిసెంబరు 31 నాటికి ముగించడమే మేలు
పత్తి పంటను ఆరు నెలల్లో (డిసెంబరు 31 నాటికి) ముగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో గులాబీ పురుగులు లేని సమయంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు పత్తి చేనును ఉంచినా ఇబ్బంది ఉండేది కాదు. నీటి వసతి, ఎరువులు వేస్తే సరిపోయేది. కానీ, కొంతకాలంగా గులాబీ రంగు పురుగు పత్తి పంటకు కొరకరాని కొయ్యలా తయారైంది. చలికాలం మొదలవగానే గులాబీ పురుగు తీవ్రత పెరుగుతోంది. నష్టశాతం కూడా పెరిగిపోయింది. మందులు కొడుతున్నా తగ్గే పరిస్థితి లేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు పత్తి సాగును పొడిగిస్తే.. కాయలు పుచ్చుపట్టి పోతాయే తప్ప ఫలితం ఉండదని కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త రాంప్రసాద్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. డిసెంబరు నెలాఖరు నాటికి పత్తి పంటను ముగించి.. ప్రత్యామ్నాయ, ఆరు తడి పంటలు వేసుకోవాలని తెలిపారు. అదేక్రమంలో నవంబరు 20లోపు మొక్కజొన్న విత్తనాలు వేస్తే యాసంగి సీజన్‌లో దిగుబడి ఎక్కువగా వస్తుందని తెలిపారు.