Share News

Corruption: లంచం సొమ్ము నా ఒక్కదానికే కాదు

ABN , Publish Date - Sep 17 , 2025 | 06:07 AM

నార్సింగ్‌ మునిసిపాలిటీలో రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సాక మణిహారిక కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి..

Corruption: లంచం సొమ్ము నా ఒక్కదానికే కాదు

  • మునిసిపల్‌ కమిషనర్‌, లీగల్‌ అడ్వైజర్‌,కంప్యూటర్‌ ఆపరేటర్‌ కలిసి పంచుకుంటాం

  • స్పై కెమెరాలో మణిహారిక సంభాషణ రికార్డు

  • డిజిటల్‌ ఫైల్‌ను కోర్టులో సమర్పించిన ఏసీబీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి)? నార్సింగ్‌ మునిసిపాలిటీలో రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సాక మణిహారిక కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. లంచం సొమ్ము తనకొక్కదానికే కాదని కమిషనర్‌, లీగల్‌ అడ్వైజర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ కలిసి పంచుకుంటామని మణిహారిక బాధితుడితో మాట్లాడిన సంభాషణకు సంబంధించిన డిజిటల్‌ ఫైల్‌ను ఏసీబీ అధికారులు కోర్టులో సమర్పించారు. ఈ కేసులో మునిసిపల్‌ లీగల్‌ అడ్వైజర్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్‌ కీలకపాత్ర పోషించాడని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. మంచిరేవుల గ్రామంలో వెయ్యి గజాల స్థలానికి ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఓ వ్యక్తి రూ.6,65,002 ఫీజు చెల్లించారు. అయితే, ఆ ఫైల్‌ క్లియర్‌ కావాలంటే లంచం కావాల్సిందేనని టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ మణిహారిక పట్టుబట్టారు. మలక్‌పేటలో ఉన్న తమ లీగల్‌ అడ్వైజర్‌ లక్ష్మణ్‌ను కలవాలని చెప్పారు. ఈ క్రమంలో బాధితుడు లక్ష్మణ్‌ను కలిశాడు. ఫైల్‌ క్లియర్‌ కావాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడికి సీక్రెట్‌ కెమెరాను ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల సదరు వ్యక్తి నార్సింగ్‌ మునిసిపాలిటీకి వెళ్లి మణిహారికను కలిశాడు. లక్ష్మణ్‌ అడిగిన రూ.10 లక్షలు ఇవ్వలేనని, కొంత తగ్గించాలని ప్రాధేయపడ్డాడు. దీంతో తనకు రూ.4 లక్షలు, రూ.50 వేలు లక్ష్మణ్‌కు ఇవ్వాలని మణిహారిక సూచించారు. తానొక్కదాన్నే డబ్బు తీసుకోవడం లేదని, నార్సింగ్‌ మునిసిపల్‌ కమిషనర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పంచుకుంటామని మణిహారిక పేర్కొన్నారు. అనంతరం బాధితుడు మణిహారికకు డబ్బు ఇవ్వగానే ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఈ కేసులో నార్సింగ్‌ మునిసిపల్‌ కమిషనర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మధు, లీగల్‌ అడ్వైజర్‌ లక్ష్మణ్‌కు సంబంధం ఉందని వెల్లడైన నేపథ్యంలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తున్నామని ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 06:07 AM