Corruption: కదులుతున్న జీసీసీ అక్రమాల డొంక
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:07 AM
గిరిజన సహకార సంస్థ (జీసీసీ)లో అక్రమాల డొంక కదులుతోంది. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి జీసీసీలో జరిగిన అవినీతి వ్యవహారాల చిట్టా తయారవుతోంది......
ఒకవైపు విజిలెన్స్, ఇంటెలిజెన్స్.. మరోవైపు శాఖాపరమైన విచారణ
జీఎం సీతారాం నాయక్‌ను ప్రశ్నించిన నిఘా అధికారులు
86 ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్న అధికారులు
‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాల్లోని అంశాలవారీగా సాగుతున్న విచారణ
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గిరిజన సహకార సంస్థ (జీసీసీ)లో అక్రమాల డొంక కదులుతోంది. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి జీసీసీలో జరిగిన అవినీతి వ్యవహారాల చిట్టా తయారవుతోంది. ఓ వైపు విజిలెన్స్, ఇంటెలిజెన్స్ వంటి నిఘా వర్గాలు విచారణ జరుపుతుండగా.. ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించింది. అవినీతి అక్రమాల గురించే కాకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టంపై కూడా లెక్కలు తీస్తున్నారు. విజిలెన్స్ అధికారులు జీసీసీ జనరల్ మేనేజర్ సీతారాం నాయక్‌ను తమ కార్యాలయానికి పిలిపించుకుని ప్రశ్నించినట్లు తెలిసింది. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని జీసీసీ అధికారులు, ఉద్యోగులను కూడా విచారణ చేశారు. జీసీసీల్లో అవినీతి అక్రమాలపైన ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వాటిలోని అంశాల ఆధారంగా విచారణాధికారులు 86 ప్రశ్నలతో ప్రశ్నావళి రూపొందించి.. వాటికి సంబంధించి ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రశ్నిస్తూ సమాధానాలు రాబడుతున్నారు. దీంతో జీసీసీ అధికార వర్గాల్లో భయాందోళన మొదలైంది. అటవీ ఉత్పత్తుల సేకరణ, విక్రయాలు, జీసీసీల ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకుల నిర్వహణ, ఇటీవల పదోన్నతులు, డీఏ, ఐఆర్ చెల్లింపుల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. కాగా, ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జీఎం సీతారాం నాయక్ ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. విచారణ పూర్తయ్యేవరకు ఆ అధికారి కార్యాలయానికి రాకుంటే అసలేం జరుగుతోందో ధైర్యంగా చెప్పగలమని పలువురు ఉద్యోగులు ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. కాగా, మూడు నాలుగు రోజుల్లో విచారణ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.