Share News

Corruption Allegations: దేవాదాయం.. దైవాధీనం!

ABN , Publish Date - Oct 22 , 2025 | 04:09 AM

దేవాదాయ శాఖ నిర్వహణ పూర్తిగా దైవాధీనంగా మారింది. మంత్రి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో కొందరు ఆడిందే ఆట...

Corruption Allegations: దేవాదాయం.. దైవాధీనం!

  • శాఖపై కొరవడిన పర్యవేక్షణ.. పలువురు ఈవోలపై అవినీతి ఆరోపణలు

  • ఓ ఈవో అక్రమ ఆదాయం రూ.కోట్లలో

  • సస్పెన్షన్‌కు గత కమిషనర్‌ సిఫారసు

  • ఆయన బదిలీ తర్వాత ఫైలు మాయం

  • కీలక ఆలయానికి మూడేళ్లు బడ్జెట్‌ లేదు

  • నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు

  • డిగ్రీ లేకున్నా జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు

  • ఆలయాల్లోని పారిశుధ్య సిబ్బంది.. అధికారులకు డ్రైవర్లుగా చలామణీ

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖ నిర్వహణ పూర్తిగా దైవాధీనంగా మారింది. మంత్రి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో కొందరు ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. దేవాదాయ శాఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే స్వీపర్‌ నుంచి ప్రధాన కార్యాలయంలో కీలక విభాగాల్లో విధులు నిర్వహించే అధికారుల వరకు ఎవరి పరిచయాలు, పలుకుబడి మేరకు వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. హింధూ ధర్మం, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న దేవాదాయ శాఖలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యంత కీలకమైన ఆలయాన్నిఏకంగా మూడేళ్ల పాటు బడ్జెట్‌ మంజూరు లేకుండానే నిర్వహించారు. అయినా ప్రధాన కార్యాలయ అధికారులు, సొంత శాఖలోని నిఘా విభాగం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు ఈవోలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బిల్లులు, ప్రసాదాల తయారీ, విక్రయాలు, ఆర్జిత సేవల్లో చేతివాటం.. సర్వసాధారణ అంశంగా మారింది. ఓ ఈవో అక్రమ ఆదాయం కోట్లల్లో ఉందనే విషయం దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయంలోనే చర్చకు వచ్చిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఓ ఈవో అవినీతి, అక్రమాలపై గత దేవాదాయ శాఖ కమిషనర్‌ విచారణ జరిపించి ఏకంగా సస్పెన్షన్‌కు ఫైల్‌ సిద్ధం చేశారు. ఇంతలో కమిషనర్‌ బదిలీ కావడంతో దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆ ఫైల్‌ మాయం చేశారని సొంత శాఖలోని వారే చర్చించుకుంటున్నారు. ఆలయాల్లో పారిశుధ్య కార్మికులుగా ఉండాల్సిన కొందరు అక్కడ పనిచేయడం ఇష్టం లేక అధికారులను ప్రసన్నం చేసుకుని వారి వద్ద డ్రైవర్లుగా చేరిపోయారు. జీతం ఆలయం నుంచి తీసుకుంటూ పని మాత్రం నచ్చినచోట చేస్తున్నారు. జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేయాలంటే డిగ్రీ విద్యార్హత తప్పనిసరి. కానీ కొందరు తమకు ఉన్న పరిచయాలతో విద్యార్హత లేకపోయినా... జూనియర్‌ అసిస్టెంట్లుగా కొనసాగుతున్నారు. అనర్హులకు అందలంతో అన్ని అర్హులు పోస్టింగ్‌, పదోన్నతుల్లో వెనుకబడిపోతున్నారు. కొందరు అధికారులు అయినవారిని అందలం ఎక్కించేందుకు అడ్‌హక్‌ పదోన్నతులు, పోస్టుల అప్‌గ్రేడేషన్‌ను కొనసాగిస్తూ వస్తున్నారు. సొంత శాఖలో పదోన్నతులు, పోస్టింగులకు అర్హులు ఉన్నా... ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి ఏళ్ల తరబడి కీలక పోస్టింగ్‌లో కొనసాగించడంపైనా విమర్శలు వస్తున్నాయి. దేవాదాయ శాఖలో బదిలీలు, పోస్టింగుల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం ఏ జోన్‌లో ఉన్న వారిని ఆ జోన్‌లోనే బదిలీ చేయాలి. కానీ దీనికి విరుద్ధంగా బదిలీలు చేశారు. ఈ తప్పిదాన్ని తీరిగ్గా గుర్తించిన అధికారులు సరిదిద్దుకునే చర్యలు చేపట్టారు.

Updated Date - Oct 22 , 2025 | 04:09 AM