Kavita Kalvakuntla: ఆర్‌ఆర్‌ఆర్ భూ సేకరణలో అవినీతి
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:37 AM
రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) భూసేకరణలో అవినీతి జరిగిందని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భూములను కాపాడుకోవడానికి అలైన్‌మెంట్‌ను మార్చారని తెలంగాణ జాగృతి....
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల స్వార్థం కోసం రైతులను బలి చేశారు
అలైన్‌మెంట్ మారుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది
న్యాయం చేస్తారా? లేదా?
జాగృతి అధ్యక్షురాలు కవిత
యాదాద్రి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) భూసేకరణలో అవినీతి జరిగిందని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భూములను కాపాడుకోవడానికి అలైన్‌మెంట్‌ను మార్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ స్వార్థం కోసం రైతులను బలి చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ దుర్మార్గాన్ని కొనసాగిస్తుందా? అని ప్రశ్నించారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మోటకొండూరులో మంగళవారం నిర్వహించిన జాగృతి జనం బాట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రీజినల్ రింగ్‌రోడ్డు, బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులతో సమావేశమయ్యారు. అనంతరం విద్యార్థులకు స్కూటీలు ఎక్కడ? అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొందరు ఎమ్మెల్యేల కోసం అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు రైతులకు బేడీలు వేసిందని విమర్శించారు. అప్పుడు ఈ విషయం తన దృష్టికి వచ్చి ఉంటే కచ్చితంగా పోరాటం చేసేదాన్నని, తాను బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నా ఏమీ చేయలేకపోయినందుకు క్షమించాలని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మారుస్తామని ఎన్నికలకు ముందు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజలకు మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే అలైన్‌మెంట్ మూడుసార్లు మారిందని, ప్రజలకు న్యాయం చేస్తారా? లేదా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాయగిరి వాసులు ఇప్పటికే ఆరు ప్రాజెక్టులకు భూములు ఇచ్చారని,ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ కోసం కూడా వారి భూములనే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2015లో పార్లమెంట్‌లో పట్టుబట్టి తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేయించగా, ఇప్పటికీ పనులు పూర్తికాకపోవడం బాధాకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు.. కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఎయిమ్స్‌ను పూర్తి చేయించాలని కోరారు. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత రైతులకు అన్యాయం జరగలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.