Employee Promotion: సచివాలయంలో ఆ ఉద్యోగి స్పెషల్
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:37 AM
సచివాలయంలో ఓ ఉద్యోగికి పదోన్నతి లభించినప్పటికీ, ఆయనకు మళ్లీ అదే విభాగంలో పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
12 ఏళ్లుగా ఒకేచోట.. పదోన్నతి తర్వాత మళ్లీ అక్కడికే
35 మందికి ఒక జీవో.. ఆయనొక్కరికే మరో జీవో
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలో ఓ ఉద్యోగికి పదోన్నతి లభించినప్పటికీ, ఆయనకు మళ్లీ అదే విభాగంలో పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. సాధారణ పరిపాలన శాఖలో పనిచేస్తున్న ఆ ఉద్యోగికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎ్‌సవో) నుంచి సెక్షన్ ఆఫీసర్ (ఎస్‌వో)గా పదోన్నతి లభించింది. అయితే, 12 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న ఆయనను బదిలీ చేయకుండా మళ్లీ అదే విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగి ఒకే శాఖలో 6 ఏళ్లకు మించి పనిచేసినట్లయితే, వారిని వేరే శాఖకు బదిలీ చేయాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధనను 4 ఏళ్లకు తగ్గించింది. దీంతో చాలా మంది ఉద్యోగులను బదిలీ చేశారు. ఆగస్టులో 36 మంది ఉద్యోగులకు పదోన్నతులు వచ్చాయి. వారిలో 35 మంది బదిలీలకు సంబంధించి ఒకే జీవో జారీ చేయగా, సదరు ఉద్యోగికి మాత్రం ప్రత్యేకంగా వేరే జీవో జారీ చేశారు. ప్రస్తుతం ఆయన పనిచేస్తున్న శాఖలోనే ఖాళీలు ఉన్నాయని అధికారులు కారణం చూపినప్పటికీ, ఈ చర్య నిబంధనలకు విరుద్ధమని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఒక ఉన్నతాధికారి జోక్యం చేసుకున్నట్లు గుసగులు వినిపిస్తునాయి.