దేవాదాయ శాఖలో సొమ్మొకరిది... సోకొకరిది!
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:57 AM
దేవాదాయ శాఖలో అధికారుల తీరు ఇష్టారాజ్యంగా మారింది. తాజాగా అధికారులు తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
అధికారుల విలాసాలకు ఏసీలు, కూలర్ల కొనుగోళ్లకు ప్రతిపాదనలు
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖలో అధికారుల తీరు ఇష్టారాజ్యంగా మారింది. తాజాగా అధికారులు తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అర్చక, ఉద్యోగులు, వారి కుటుంబం సంక్షేమానికి మాత్రమే ఉపయోగించాల్సిన వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు నిధుల్ని ప్రధాన కార్యాలయంలో ఏసీలు, కూలర్లు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇది తగదని కొందరు అధికారులు వారించడంతో విషయం తాత్కాలికంగా వాయిదా పడింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ వాటాగా వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డుకు రూ. 69 కోట్ల నిధులు జమయ్యాయి.
ఈ మొత్తానికి బ్యాంకు వడ్డీతో కలిపి ప్రస్తుతం రూ. 240 కోట్లు వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు ఖాతాలో ఉన్నాయి. దేవాదాయ శాఖ నూతన డైరెక్టర్ వచ్చిన తర్వాత 28 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కొద్ది రోజుల క్రితం రూ.33 లక్షల ఆర్థిక సహాయం మంత్రి చేతుల మీదుగా అందించారు. నిబంధనల ప్రకారం ట్రస్ట్ బోర్డు నిధులు ఉద్యోగుల సంక్షేమం కోసం, పదవీ విరమణ అనంతరం వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు మాత్రమే ఉపయోగిస్తారు.