Share News

Harish Rao: విద్యుత్‌పై పొంతన లేని లెక్కలు

ABN , Publish Date - Nov 30 , 2025 | 06:41 AM

ద్యుత్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు పొంతనలేని లెక్కలు చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Harish Rao: విద్యుత్‌పై పొంతన లేని లెక్కలు

  • మొన్నటి శ్వేతపత్రం, గ్రీన్‌ ఎనర్జీ పాలసీలో

  • ఒకమాట.. ఇప్పుడు పీపీటీలో మరోమాట

  • భట్టి, శ్రీధర్‌బాబుకు హరీశ్‌ కౌంటర్‌

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు పొంతనలేని లెక్కలు చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. డిప్యూటీ సీఎంగా, విద్యుత్‌ మంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న భట్టి శాఖలోని విషయాలపై అవగాహన లేకపోయినప్పటికీ ఇతరులను రాజకీయాలకు పనికిరారనడం తగునా అని ప్రశ్నించారు. విద్యుత్‌పై డిప్యూటీ సీఎం అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన శ్వేతపత్రం, ఇటీవల విడుదల చేసిన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ-2025, శనివారం పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ (పీపీటీ)లో చెప్పిన విద్యుత్‌ గణాంకాలు ఒక దానికి మరొకటి పొంతన లేకుండా ఉన్నాయని విమర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబు అధికారులు రాసిచ్చినదాన్ని గుడ్డిగా చదివినట్లు ఉందన్నారు. శ్వేతపత్రం పేజీ నెం.11లో ఏముందో ఒకసారి చూసుకోవాలని మంత్రికి సూచించారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు బొగ్గు రవాణాకు ఏడాదికి రూ.803 కోట్లు కావాలని శ్వేతపత్రంలో పేర్కొని.. ఇప్పుడు రూ.1,600 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారని విమర్శించారు. నాడు ఆ ప్లాంట్‌ నిర్మాణాన్ని తప్పు పట్టిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు మక్తల్‌ వద్ద థర్మల్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తామంటున్నారని, నాడు యాదాద్రి తప్పయితే, నేడు మక్తల్‌ ఒప్పు అవుతుందా అని ప్రశ్నించారు. ‘మీ శ్వేతపత్రం పేజీ నం.7లో 1-12-2023 నాటికి సోలార్‌ కెపాసిటీ 6123 మెగావాట్లు అని చెప్పారు. 11-01-2025న మీరు విడుదల చేసిన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ పేజీ నం.8లో 5,415 మెగావాట్లు అన్నారు. 2023లో 6,123 మెగావాట్లు ఉంటే, 2025 నాటికి 5,415 మెగావాట్లు ఎలా అయింది. గతంలో ప్రకటించిన శ్వేతపత్రం, పాలసీతో పోల్చి చూసుకున్నారా?’ అని హరీశ్‌ ప్రశ్నించారు.


పునర్విభజన చట్టం ప్రకారం 1600 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్‌ అందుబాటులో ఉండగా, దాంతో ఒప్పందం చేసుకోకుండా ఎందుకు 2,400 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణానికి వెళ్తున్నారన్నారు. దీని కోసం చేసే రూ.50 వేల కోట్ల ఖర్చులో 30-40 శాతం కమీషన్‌ కోసమేనా అని ప్రశ్నించారు. ‘మీ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ పేజీ నం.3 ప్రకారం 2030 నాటికి 20 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ తీసుకొస్తున్నామన్నారు. రాబోయే ఐదేళ్లలో మీరు సాధించాల్సింది సుమారు 13,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉండగా థర్మల్‌ ప్లాంట్లని ఎందుకు వెళ్తున్నారు. మీరే ఇచ్చిన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీని ఎందుకు తుంగలో తొక్కుతున్నారు? ఇదే పాలసీ 10వ పేజీలో 2034-35 వరకు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి 16,966 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు 5,000-6,000 మెగావాట్ల లోటు ఉండబోతోందని ఎలా చెబుతున్నార’ని హరీశ్‌ ప్రశ్నించారు.

Updated Date - Nov 30 , 2025 | 06:41 AM