Contractors Protest in Secretariat: సచివాలయంలో కాంట్రాక్టర్ల ధర్నా
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:41 AM
పెండింగ్ బిల్లుల కోసం రాష్ట్ర సచివాలయంలో కాంట్రాక్టర్లు సోమవారం ఆందోళనకు దిగారు. ఆర్థిక శాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా చాంబర్ ఉన్న రెండో అంతస్తుకు భారీగా చేరుకొని బైఠాయించారు..
పెండింగ్ బిల్లుల కోసం ఆర్థికశాఖ అధికారుల చాంబర్ ఎదుట బైఠాయింపు..
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పెండింగ్ బిల్లుల కోసం రాష్ట్ర సచివాలయంలో కాంట్రాక్టర్లు సోమవారం ఆందోళనకు దిగారు. ఆర్థిక శాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా చాంబర్ ఉన్న రెండో అంతస్తుకు భారీగా చేరుకొని బైఠాయించారు. తమ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ సహా ఇతర శాఖలకు వెళ్లాలంటూ ముందుగా విజిటర్స్ పాసులు తీసుకుని దాదాపు వంద మందికిపైగా కాంట్రాక్టర్లు సచివాలయంలోకి వెళ్లారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తూ ఆర్థిక శాఖ అధికారుల చాంబర్ ముందు బైఠాయించారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పనులు పూర్తి చేసినా నిధులు విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆందోళనను గమనించిన పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సందీ్‌పకుమార్ సుల్తానియాను కలిసి బిల్లులు చెల్లించాలంటూ వారు వినతి పత్రం అందజేశారు. పెండింగ్ బిల్లులను త్వరలో క్లియర్ చేస్తామని ఆయన హామీనివ్వడంతో వెనుదిరిగినట్లు సమాచారం. కాగా, గతంలోనూ కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్ ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే.
సచివాలయంలో ధర్నా దేశంలో తొలిసారి: హరీశ్‌రావు
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు సచివాలయంలో రెండు సార్లు ధర్నా చేయడం దేశంలో ఇక్కడే మొదటిసారి జరిగి ఉంటుందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే ప్రజలంతా ఏకమై ఎక్కడిక్కడ నిలదీస్తారు.. తస్మాత్ జాగ్రత్త’ అంటూ ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు.