Next Generation Bio Bank: రోగాలను ముందే పసిగట్టి చికిత్స!
ABN , Publish Date - Nov 11 , 2025 | 03:00 AM
భవిష్యత్తులో వచ్చే జబ్బులను ముందస్తుగా పసిగట్టి సరైన చికిత్స, అవసరమైన మందులను సూచించేందుకు కాంటినెంటల్ ఆస్పత్రి నెక్స్ట్ జనరేషన్ బయో బ్యాంక్‌ను...
కాంటినెంటల్ ఆస్పత్రిలో ‘నెక్ట్స్ జనరేషన్ బయో బ్యాంక్’
హైదరాబాద్ సిటీ/రాయదుర్గం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో వచ్చే జబ్బులను ముందస్తుగా పసిగట్టి సరైన చికిత్స, అవసరమైన మందులను సూచించేందుకు కాంటినెంటల్ ఆస్పత్రి నెక్స్ట్ జనరేషన్ బయో బ్యాంక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆస్పత్రి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గురు ఎన్‌రెడ్డి, క్రానికల్ బయో సీఈవో రోహిత్ గుప్తా బయో బ్యాంక్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ బయో బ్యాంక్ కోసం వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి, వాటిపై పరిశోధనలు చేస్తామన్నారు. రక్తం, లాలాజలం, మలం, కణజాలం, క్యాన్సర్ కణాలను సేకరిస్తామని.. వాటి ఆధారంగా ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ, టీబీ జబ్బులపై పరిశోధనలు చేస్తామని వివరించారు. దీంతో ఏ జబ్బు వస్తుందో నిర్ధారించి మున్ముందు దానికి అనుగుణంగా చికిత్స అందించడానికి అవకాశముంటుందన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థల సాయంతో క్యాన్సర్, మధుమేహం, గుండె వైఫల్యం వంటి దీర్ఘకాలిక వ్యాధుల క్లినికల్ లక్షణాలను గుర్తించి అంచనా వేయొచ్చన్నారు. కొత్తగా వచ్చే జబ్బులను గుర్తించడం, చికిత్స, మందులను సూచించడమే ఈ ప్రక్రియ అని తెలిపారు. క్రానికల్ బయో (యూఎస్) సహ వ్యవస్థాపకుడు, ఆస్పత్రి డైరెక్టర్ రిషిరెడ్డి పాల్గొన్నారు.