All Party Leaders: బీసీ రిజర్వేషన్లకురాజ్యాంగ సవరణ తప్పనిసరి
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:30 AM
బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయడం తప్పనిసరని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి విస్తృత...
బీసీ జేఏసీ సమావేశంలో అఖిలపక్ష నేతల ప్రకటన
8 దశల ఆందోళన కార్యాచరణకు ఆమోదం
బంజారాహిల్స్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయడం తప్పనిసరని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయమై చట్టం చేయకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. రిజర్వేషన్ల సాధన కోసం 8 దశల కార్యాచరణ ఆందోళనను సమావేశం ఆమోదించింది. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్, కో-చైర్మన్ దాసు సురేశ్ సంయుక్త ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కళింగ కల్చరల్ సెంటర్‌లో సమావేశం జరిగింది. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘బీసీ రిజర్వేషన్ల కోసం రాజీ లేని సమరమే. బీసీలకు రాజకీయ, సామాజిక న్యాయం జరిగే వరకూ ఈ ఉద్యమం ఆగదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలదే బీసీ రిజర్వేషన్ల పెంపు బాధ్యత’ అని స్పష్టం చేశారు. దాసు సురేశ్ మాట్లాడుతూ.. బీసీలకు 42ు రిజర్వేషన్లకు ఆదర్శమైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మాదిరిగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. జెండాను పక్కనబెట్టి ఒకే ఏజెండాతో పని చేస్తే లక్ష్యం నెరవేరుతుందన్నారు. సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. చరిత్రలో పోరాడిన సమాజమే గెలిచిందని, బీసీలూ తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మార్సీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ, విశ్రాంత ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్ అనిల్, సినీ దర్శకుడు ఎన్. శంకర్, రచయిత జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.