CBI Director Nageswara Rao: రాజ్యాంగం పవిత్ర గ్రంథమేమి కాదు
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:13 AM
రాజ్యాంగం పవిత్ర గ్రంథమేమి కాదని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పవిత్ర గ్రంథమైతే...
అయితే 106 సార్లు సవరణ ఎందుకు చేస్తారు
సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : రాజ్యాంగం పవిత్ర గ్రంథమేమి కాదని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పవిత్ర గ్రంథమైతే 106సార్లు ఎందుకు సవరిస్తారన్నారు. పవిత్ర గ్రంథాలుగా భావించే రామాయణం, భారతం, భగవద్గీత వంటి గ్రంఽథాలకు సవరణలు జరగలేదన్నారు. ఈమేరకు శనివారం ఫిలింనగర్ క్లబ్‌లో పాత్రికేయులతో, మేధావులతో ‘‘హిందువులకు సమాన హక్కుల నిరాకరణ, రాజ్యాంగ వివక్ష’’ అనే అంశంపై చర్చిస్తూ.. ఎక్కడైతే హిందువులు మెజారిటీగా ఉన్నారో అక్కడ అన్య మతస్థులు కూడా మనుగడ సాగించగలుగుతున్నారని, కానీ ఎక్కడైతే హిందువులు మైనారిటీలుగా ఉన్నారో అక్కడ వారి జీవనమే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు కొన్ని ఉదాహరణలు చెబుతూ.. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో కశ్మీర్‌లో 21 శాతంగా ఉన్న హిందువులు నేడు ఒక్క శాతం కూడా లేరన్నారు. లౌకిక వాదం గురించి వివరించే రాజ్యాంగ వ్యవస్థ కశ్మీర్‌లో హిందువులపై జరిగిన ఈ మారణహోమాన్ని ఎందుకు ఆపలేకపోయిందని ప్రశ్నించారు. హిందువులకు విద్యా హక్కులోను వివక్ష ఉందని చెప్పారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్యయుత రాజ్యాంగాల్లో ఎక్కడా మైనారిటీ, మెజారిటీ అనే భావన లేదన్నారు. భారత దేశానికి కూడా అధికార మతం లేనపుడు ఈ ప్రతిపాదన ఎందుకుందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 28, 29, 30లను పరిశీలిస్తే హిందువులకు విద్య ప్రాథమిక హక్కుగా లేదని, కేవలం పౌర హక్కుగానే ఉందన్నారు. క్రైస్తవులకు, ముస్లింలకు మాత్రమే విద్య ప్రాథమిక హక్కుగా కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. అందుకే వారి విద్యా హక్కుల పరిరక్షణకు ప్రత్యేకమైన చట్టాలు, కమిషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ కె.అరవింద రావు పాల్గొన్నారు.