Share News

Telangana Crime: కానిస్టేబుల్‌ను పొడిచి చంపిన పాత నేరస్థుడు

ABN , Publish Date - Oct 18 , 2025 | 04:56 AM

బైక్‌ చోరీ కేసులో నిందితుణ్ని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసు కానిస్టేబుల్‌ను.. ఆ నిందితుడు నడిరోడ్డుపై పొడిచి పారిపోయాడు! నిజామాబాద్‌లోని నాలుగో...

Telangana Crime: కానిస్టేబుల్‌ను పొడిచి చంపిన పాత నేరస్థుడు

  • నిజామాబాద్‌లో నడిరోడ్డుపై దారుణం

  • బైక్‌ చోరీ కేసు నిందితుణ్ని అరెస్ట్‌ చేసి తీసుకెళ్తుండగా ఘటన

నిజామాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): బైక్‌ చోరీ కేసులో నిందితుణ్ని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసు కానిస్టేబుల్‌ను.. ఆ నిందితుడు నడిరోడ్డుపై పొడిచి పారిపోయాడు! నిజామాబాద్‌లోని నాలుగో ఠాణా పరిధిలో ఉన్న వినాయక్‌ నగర్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సీసీఎస్‌ ఎస్‌ఐ విట్టల్‌, కానిస్టేబుల్‌ ప్రమోద్‌.. పట్టణంలోని నాగారం ప్రాంతానికి చెందిన రియాజ్‌ అనే పాత నేరగాణ్ని బైక్‌ చోరీ కేసులో పట్టుకునేందుకు వెళ్లారు. ప్రమోద్‌ రియాజ్‌ను బైక్‌పై వెనుక కూర్చోబెట్టుకొని తీసుకొస్తుండగా.. రియాజ్‌ వెనుక నుంచి ప్రమోద్‌ ఛాతీలో కత్తితో పొడిచాడు. కత్తి గాయంతో ప్రమోద్‌కు తీవ్ర రక్తస్రావం కాగా.. ఆ సమయంలో అటుగా వెళ్తున్న మోపాల్‌ ఎస్సై తన వాహనంలో అతణ్ని జిల్లా ఆస్పతిక్రి తీసుకెళ్లారు. కానీ, మార్గమధ్యంలోనే అతడు మరణించాడు. కానిస్టేబుల్‌ ప్రమోద్‌పై కత్తితో దాడి చేసే సమయంలో అడ్డుపడిన ఎస్సైపై కూడా నిందితుడు దాడికి దిగాడు. దీంతో ఆయన చేతికి గాయం అయింది. దాడి అనంతరం తప్పించుకు పారిపోయిన రియాజ్‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 2003 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌ ప్రమోద్‌.. ఇటీవల బదిలీలలో ట్రాఫిక్‌ విభాగం నుంచి సీసీఎ్‌సకు వచ్చాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రియాజ్‌పై దొంగతనం, హత్య, చైన్‌ స్నాచింగ్‌ సహా పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

Updated Date - Oct 18 , 2025 | 04:56 AM