Relationship Fraud: ప్రేమ, పెళ్లి పేరుతో కానిస్టేబుల్ మోసం!
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:08 AM
ప్రేమ, పెళ్లి అంటూ ఆ కానిస్టేబుల్ నమ్మించి.. మోసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దళిత యువతి బలవన్మరణానికి పాల్పడింది...
పురుగుల మందు తాగి దళిత యువతి బలవన్మరణం
ఉద్యోగం నుంచి కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ డిస్మిస్
గద్వాల క్రైం/గట్టు, ఆక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రేమ, పెళ్లి అంటూ ఆ కానిస్టేబుల్ నమ్మించి.. మోసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దళిత యువతి బలవన్మరణానికి పాల్పడింది. గద్వాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతురాలు ప్రియాంక(32) స్వస్థలం కొత్తగూడెం జిల్లా పాల్వంచ. రఘునాథ్ గౌడ్ అనే యువకుడిది గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి. హైదరాబాద్‌లోని ఓ శిక్షణ కేంద్రంలో ప్రియాంక-రఘునాథ్ మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని ప్రియాంకను నమ్మించి.. ఆమెతో సన్నిహితంగా గడిపాడు. కొన్నాళ్లకు రఘునాథ్‌కు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రియాంకతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆమె జూలై 17న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు రఘునాథ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం రఘునాథ్ ఇంటికి వెళ్లిన ప్రియాంక అక్కడే ఉంటోంది. దీంతో రఘునాథ్ కుటుంబసభ్యులు నివాసాన్ని మల్దకల్‌కు మార్చారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రియాంక ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను ఆమెను 108లో ఆస్పత్రికి తరలించారు. ఆ రోజు సాయంత్రం వరకు చికిత్స పొందిన ఆమె ఆస్పత్రి నుంచి బయటకొచ్చి మల్దకల్‌లోని రఘునాథ్‌గౌడ్ తల్లిదండ్రులు ఉన్న ఇంటికి వెళ్లి వారితో వాగ్వాదానికి దిగింది. చిన్నోనిపల్లికి వెళ్లాలని వారు సూచించారు. చిన్నోనిపల్లికి వెళ్లిన ప్రియాంక అక్కడ కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలుపుకొని తాగింది. సమాచారం అందడంతో డీఎస్పీ ఆమెను 108లో గద్వాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతిచెందింది. ఆమె మృతికి రఘునాథ్ గౌడ్, అతడి కుటుంబసభ్యులు 22 మంది కారణం అని మృతిరాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ప్రియాంక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే రఘునాథ్‌గౌడ్‌ను సస్పెండ్ చేశామని, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించారు.