Share News

TPCC chief Mahesh Goud: కాంగ్రెస్‌ సర్కారు కక్ష సాధింపులకు పోదు..

ABN , Publish Date - Nov 21 , 2025 | 04:36 AM

కాంగ్రెస్‌ సర్కారు ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పోదని.. అలా చేసి ఉంటే కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావులు ఈపాటికే జైల్లో ఉండి ....

TPCC chief Mahesh Goud: కాంగ్రెస్‌ సర్కారు కక్ష సాధింపులకు పోదు..

  • అలా చేసుంటే కేసీఆర్‌ కుటుంబం జైల్లో ఉండేది..

  • గవర్నర్‌ అనుమతి ఎందుకు జాప్యమైందో కిషన్‌రెడ్డి,

  • బండి సంజయ్‌లే చెప్పాలి: మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సర్కారు ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పోదని.. అలా చేసి ఉంటే కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావులు ఈపాటికే జైల్లో ఉండి ఉండేవారని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓటమితో బీజేపీకి దిమ్మ తిరిగిపోయిందని, దీంతో ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌పై చార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు గవర్నర్‌ అనుమతి వచ్చేసిందని చెప్పారు. గవర్నర్‌ అనుమతించేందుకు 6 నెలల సమయం ఎందుకు పట్టిందన్నది కేంద్ర మంత్రులు, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లే చెప్పాలన్నారు. గురువారం గాంధీభవన్‌లో మహేశ్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌ల మధ్య చీకటి ఒప్పందాలే ఉంటే ఆరు నెలల కిందటే కేటీఆర్‌పై చార్జ్‌షీట్‌ దాఖలుకు గవర్నర్‌ నుంచి అనుమతి వచ్చి ఉండేది కదా అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌పై చట్ట ప్రకారమే విచారణ జరుగుతుందన్నారు. పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినంత మాత్రాన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పోరాటం ముగిసినట్లు కాదన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుంద ని చెప్పారు. కాగా, ఓట్‌ చోరీని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్ర మం కోసం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి చైర్మన్‌గా ఓ కమిటీని మహేశ్‌గౌడ్‌ నియమించారు.

లొట్ట పీసు కేసన్న కేటీఆర్‌.. విచారణకు సహకరించాలి: చామల

ఫార్ములా ఈ రేసు కేసును లొట్ట పీసు కేసన్న కేటీఆర్‌.. విచారణకు సహకరించాలని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌పై చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేయాలంటే ఏ2గా ఉన్న ఐఏఎస్‌ అర్వింద్‌ కుమార్‌నూ విచారించాల్సి ఉంటుందని.. అయితే ఆయనపై చార్జ్‌షీట్‌ దాఖలు కాకుండా డీఓపీటీలో ఆపే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. కేటీఆర్‌ నిజంగా నిజాయతీపరుడే అయితే.. ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించకుండా విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని.. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ ఆమోదమన్నది రాజ్యాంగబద్ధమైన విషయమని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 04:36 AM