Congress Welcomes: కప్పింది కాంగ్రెస్ కండువానే!
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:42 AM
ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారంతా నిరంతరం ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని బీఆర్‌ఎస్ తెలిపింది..
ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ భేటీల్లోనూ పాల్గొన్నారు
ఆ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు
అభివృద్ధి కోసం కలిసింది కాదు.. ఫిరాయింపే
రాహుల్‌ని కలిశారు.. ఫొటోలు కూడా దిగారు
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై అసెంబ్లీ అదనపు
కార్యదర్శికి ఆధారాలు అందజేసిన బీఆర్‌ఎస్
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారంతా నిరంతరం ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని బీఆర్‌ఎస్ తెలిపింది. వారు సీఎంను కలిసిన సందర్భంగా కప్పింది కాంగ్రెస్ కండువానేనని స్పష్టం చేసింది. అప్పుడు ఇష్టంగా కప్పుకొని.. ఇప్పుడు మాత్రం జాతీయ రంగులతో ఉన్న కండువా అంటూ బుకాయిస్తున్నారని పేర్కొంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా తమ వద్ద ఆధారాలున్నాయంటూ పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ అదనపు కార్యదర్శిని కలిసి సమర్పించారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై స్పందించాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో.. పది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేయడం, అందుకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వివరణ ఇస్తూ తాము పార్టీ మారలేదని, బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతున్నామని చెప్పడం తెలిసిందే. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము సీఎంను కలిశామని వారు స్పీకర్‌కు తెలిపారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ తమకు మరింత గడువు కావాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిసింది. కాగా, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలను స్పీకర్ బీఆర్‌ఎ్‌సకు పంపించి ఆ పార్టీ వివరణ కోరారు. ఈ మేరకు వివరణ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. అయితే స్పీకర్ ప్రసాద్‌కుమార్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి.. బెంగళూరులో ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లడంతో అసెంబ్లీ అదనపు కార్యదర్శి ఉపేందర్‌రెడ్డిని కలిశారు. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, అందుకు ఆధారాలు ఇవేనంటూ ఫొటోలు, పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారం, ఇతర ఆధారాలు అందజేశారు.
ఫొటోలు దిగారు.. ప్రకటనలు ఇచ్చారు..
‘‘జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఒకరోజు ట్వీట్ పెట్టారు. నేను జగిత్యాలలో బయలుదేరాను.. ఇక్కడి నుంచి నేరుగా గాంధీభవన్‌కు వెళ్తున్నా అని. ఇదిగో సాక్ష్యం! పోచారం శ్రీనివా్‌సరెడ్డి బహిరంగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను గెలిపించాలని బాన్సువాడ నియోజకవర్గంలో నిర్వహించిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు. ఆయన రాహుల్‌గాంధీని కలిసి ఫొటో కూడా దిగారు. ఇదిగో ఆ ఫోటో! గద్వాల ఎమ్మెల్యేల బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఒకరోజు పత్రికలో ప్రకటన కూడా ఇచ్చారు. అందులో కాంగ్రెస్ నాయకుల పేర్లు, ఫొటోలు ఉన్నాయి చూడండి! గూడెం మహిపాల్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య కూడా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు’’ అంటూ పలు రుజువులను అసెంబ్లీ అదనపు కార్యదర్శికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సమర్పించారు. మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి రుజువులు సమర్పించాల్సి ఉండగా.. ఆరుగురిపైనే సాక్ష్యాలు అందజేశారు. అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్‌పై ఫిర్యాదు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా.. ఆయన వచ్చిన వెంటనే ఈ ఇద్దరికి సంబంధించిన ఆధారాలు, సమాధానాలను అందజేస్తామని బీఆర్‌ఎస్ పార్టీ తెలిపింది.
కలిసిన వారికల్లా కండువాలు ఎందుకు కప్పలేదు?
‘‘ఆ ఎమ్మెల్యేలు చెబుతున్నట్లే ఒకవేళ వారు కాంగ్రెస్‌లో చేరకపోతే.. ఒక్కసారి కూడా ఆ విషయాన్ని ఎందుకు ఖండించలేదు? పార్టీ మారలేదని, కేవలం అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి ఎందుకు చెప్పలేదు? బీఆర్‌ఎ్‌సకే చెందిన హరీశ్‌రావు, పద్మారావుగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి కూడా సీఎంను కలిశారు కదా? మరి సీఎం వారికెందుకు కండువాలు కప్పలేదు? బీజేపీ ఎమ్మెల్యేలు సైతం సీఎంను కలిశారు. వారికీ కండువా కప్పలేదు ఎందుకు? ఆయనను కలిసిన వారికల్లా ఎందుకు కండువాలు కప్పలేదు?’’ అని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు జి.జగదీశ్‌రెడ్డి, వివేకానందగౌడ్, చింత ప్రభాకర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరకుండా బీఆర్‌ఎ్‌సలోనే ఉంటే.. పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. పార్టీ మారనప్పుడు పోచారం శ్రీనివా్‌సరెడ్డి.. రాహుల్‌గాంధీని ఎందుకు కలిశారని, రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకొన్నారని నిలదీశారు. ఇప్పుడు అది పార్టీ కండువా కాదని ఎందుకు చెబుతున్నారో.. వారే సమాధానం చెప్పాలన్నారు. వారంతా బీఆర్‌ఎ్‌సలోనే ఉంటే రేవంత్‌రెడ్డి కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటున్నారని ప్రశ్నించారు.