Mahesh Goud: డీసీసీ అధ్యక్షులుగా కొత్త ముఖాలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:13 AM
కాంగ్రెస్ పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లకు ప్రస్తుత అధ్యక్షుల్లో...
ప్రస్తుత డీసీసీ అధ్యక్షులకు నో చాన్స్
పార్టీలో ఐదేళ్లపాటు క్రమశిక్షణతో పని చేసినవారే అర్హులు
మీనాక్షీ నటరాజన్, మహేశ్‌గౌడ్ స్పష్టీకరణ
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లకు ప్రస్తుత అధ్యక్షుల్లో ఎవరినీ కొనసాగించకుండా.. కొత్తవారిని నియమించాలని నిర్ణయించింది. వారిలోనూ గత ఐదేళ్లుగా పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ వారినే ఎంపిక చేయాలన్న నిబంధన పెట్టింది. అలాగే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల దగ్గరి బంధువులకు ఈసారి అవకాశం లేదని తేల్చేసింది. డీసీసీ అధ్యక్షులతో సోమవారం జూమ్ ద్వారా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్ష నియామక ప్రక్రియలో పాటించాల్సిన నియమాలను డీసీసీ అధ్యక్షులకు వివరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకునేవారు కనీసం ఐదేళ్లపాటు క్రమశిక్షణతో, నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్నవారై ఉండాలన్నారు. అలా లేనివారి దరఖాస్తులను ఏఐసీసీ పరిశీలకులు తొలగిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్నవారికి ఎట్టిపరిస్థితుల్లోనూ రెండోసారి అవకాశం ఉండబోదన్నారు. అలాగే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల దగ్గరి బంధువులకు కూడా డీసీసీ అధ్యక్షులుగా అవకాశం కల్పించడం లేదని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్ష నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నాయకులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. కాగా, ప్రస్తుతం జిల్లాల పర్యటనల్లో ఉన్న ఏఐసీసీ పరిశీలకులతో నాయకులు వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలు నిర్వహించవద్దని, అలాగే స్థానిక నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జిల్లా సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. పార్టీ కార్యాలయంలోగానీ, అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతాల్లోగానీ ఈ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఓటుచోరీ కార్యక్రమంలో కనీసం గ్రామానికి వంద సంతకాలు సేకరించాలని సూచించారు.