Share News

PCC Chief Mahesh Goud: నేడో రేపో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రకటన

ABN , Publish Date - Oct 07 , 2025 | 02:38 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరన్నది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, పార్టీ రాష్ట్ర...

 PCC Chief Mahesh Goud: నేడో రేపో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రకటన

  • నేడు చర్చించనున్న సీఎం, పీసీసీ చీఫ్‌, మీనాక్షి

  • మూడు పేర్లతో అధిష్ఠానానికి ప్రతిపాదన!

  • స్థానిక నేత వైపే సీఎం రేవంత్‌ మొగ్గు

  • బీసీ నేతకే టికెట్‌ దక్కే అవకాశం

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యలను.. వక్రీకరించిన బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా

  • డిసెంబరు నాటికి పార్టీ పదవుల భర్తీ

  • మీడియాతో చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరన్నది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ మంగళవారం సమావేశం కానున్నారు. జూమ్‌ ద్వారా జరిగే ఈ సమావేశంలో మూడు పేర్లతో ప్రతిపాదనను ఖరారు చేసి పరిశీలన కోసం అధిష్ఠానానికి పంపనున్నారు. ఆ పేర్లను హైకమాండ్‌ పరిశీలించి మంగళవారం రాత్రి లేదా బుధవారం అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం. ఉప ఎన్నికకు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు, వివేక్‌ వెంకటస్వామి నాలుగు పేర్లను ప్రతిపాదిస్తూ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నివేదికతోపాటు సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థి ఎంపికపైన సీఎం రేవంత్‌, మహేశ్‌గౌడ్‌, మీనాక్షీ నటరాజన్‌ చర్చించనున్నారు. నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాలు, ప్రతిపాదిత అభ్యర్థుల సానుకూల, ప్రతికూల అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆశావహుల జాబితాను మూడు పేర్లకు కుదించనున్నారు. ఒక్కో పేరుకు సంబంధించి సానుకూల, ప్రతికూల అంశాలను ప్రస్తావిస్తూ సమగ్ర ప్రతిపాదనను అధిష్ఠానానికి పంపనున్నారు. అనంతరం అధిష్ఠానం.. సీఎంరేవంత్‌ సహా ఇతర నేతలను సంప్రదించి అభ్యర్థిని ఖరారు చేయనుంది. అయితే ఈ ఉప ఎన్నిక.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా ప్రచారం జరుగుతుండడంతో సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయానికే అధిష్ఠానం ఓటు వేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, స్థానిక నేతనే అభ్యర్థిగా ఎంపిక చేయాలన్న ప్రతిపాదనకు సీఎం రేవంత్‌ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.


రేసులో ప్రధానంగా నలుగురు..

అధికార పార్టీ అభ్యర్థిత్వం కావడం, ఎంఐఎం మద్దతుతో ఉప ఎన్నికలో గెలిచే అవకాశాలుండటంతో టికెట్‌ రేసులో ఉండేందుకు నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకున్నారు. ఒకవేళ జూబ్లీహిల్స్‌ టికెట్‌ దక్కకపోయినా.. తమ రాజకీయ భవిష్యత్తుపై ప్రభుత్వం, పార్టీ నుంచి ఏదో ఒక హామీ లభిస్తుందన్న ఆశతోనూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వారు కూడా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఈ మేరకు అధిష్ఠానం పెద్దలను, ముఖ్య నాయకులను సంప్రదిస్తున్నారు. అయితే ఎవరెన్ని ప్రయత్నాల్లో ఉన్నా.. రేసులో ప్రధానంగా నవీన్‌ యాదవ్‌, సీఎన్‌ రెడ్డి, బొంతు రామ్మోహన్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ విషయంలో ఆలస్యం జరుగుతుండడంతో అజరుద్దీన్‌ సైతం జూబ్లీహిల్స్‌ టికెట్‌ కోసం అధిష్ఠానం పెద్దలను కలిశారు.

బీసీ నేతకే టికెట్‌ దక్కే అవకాశం!

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ టికెట్‌ బీసీ నేతకే దక్కే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. అధిష్ఠానం రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేయనుందని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక మాదిరిగానే జూబ్లీహిల్స్‌లోనూ గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వక్రీకరించిందని, ఈ విషయంలో అసత్య ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. ఇక పార్టీ పదవులన్నీ డిసెంబరు చివరి నాటికి భర్తీ అవుతాయని తెలిపారు. మూడు రోజుల్లో మీనాక్షీ నటరాజన్‌, ముగ్గురు మంత్రులతో కలిసి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో బస్తీ బాట కార్యక్రమం చేపడతారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక పరిస్థితులను బట్టి సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌ పార్టీల అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 02:38 AM