Share News

BC Welfare Minister Ponnam Prabhakar: సామాజిక న్యాయంతోనే ఎన్నికలకు వెళ్తాం!

ABN , Publish Date - Oct 10 , 2025 | 04:16 AM

సామాజిక న్యాయానికి చాంపియన్‌ కాంగ్రెస్‌ పార్టీ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు తమ..

BC Welfare Minister Ponnam Prabhakar: సామాజిక న్యాయంతోనే ఎన్నికలకు వెళ్తాం!

  • 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

  • బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌

  • రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు: వాకిటి

  • బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి బీసీలకు అన్యాయం చేశాయి: జూపల్లి

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయానికి చాంపియన్‌ కాంగ్రెస్‌ పార్టీ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుదలపై హైకోర్టు స్టే ఇచ్చిన అనంతరం గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ పరిశీలించిన అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం తరఫున హైకోర్టులో బలమైన వాదనలు వినిపించినట్లు చెప్పారు. న్యాయస్థానం స్టే విధిస్తుందని అనుకోలేదని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు హైకోర్టులో వేసిన కేసులో ఎందుకు ఇంప్లీడ్‌ కాలేదో బీసీలకు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, 42ు రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేదే లేదని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. బీసీలెవరూ అధైర్యపడవద్దన్నారు. రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని కోరారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి బీసీలకు అన్యాయం చేస్తున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్‌ ఆమోదించకపోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసులు వేయించింది బీఆర్‌ఎస్‌ అని పేర్కొన్నారు.తమ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంపీ మల్లు రవి చెప్పారు. అయితే కాంగ్రె్‌సతో పాటు అన్ని పార్టీలూ అధికారికంగా 42% రిజర్వేషన్‌ ఇచ్చేలా తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను పక్కన పెట్టినట్టుగా భావించాల్సి ఉంటుందన్నారు. బీసీ కులగణన ద్వారా ప్రతి కుటుంబ ఆర్థిక, సామాజిక స్థితిగతులను సీఎం రేవంత్‌ తెలుసుకున్నారని, హైకోర్టు తీర్పుతో వారి అభివృద్ధికి అడ్డుకట్ట వేసినట్లయిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. న్యాయ పోరాటం చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Oct 10 , 2025 | 04:16 AM