Congress Slams BRS: ఆ బ్యారేజీలు నాసిరకంగా కట్టిందే మీరు
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:20 AM
ఎల్లంపల్లికి దిగువన బ్యారేజీలు అత్యంత నాసిరకంగా.. కుంగిపోయేట్లు కట్టింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అంటూ కాంగ్రెస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి..
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఎల్లంపల్లికి దిగువన బ్యారేజీలు అత్యంత నాసిరకంగా.. కుంగిపోయేట్లు కట్టింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అంటూ కాంగ్రెస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రశ్నించారు. ఎల్లంపల్లి నుంచి నీటిని సముద్రంలోకి వదిలేయడం నేరపూరిత నిర్లక్ష్యమంటూ హరీశ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు నాసిరకంగా కట్టింది తామేనని, అందుకే ఎల్లంపల్లి నుంచి నీళ్లు వదలగానే అవి సమద్రంలో కలుస్తున్నాయంటూ హరీశ్‌రావు నిజం అంగీకరించారని చెప్పారు. ప్రభుత్వ పాలన ప్రజాసంక్షేమం దిశగా సాగుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ కార్యక్రమంలో భాగంగా గాంధీభవన్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారం రోజుల్లో ప్రజాభవన్‌లో నిరుద్యోగులతో భేటీ అయి.. వారి సమస్యలను వింటానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీనిచ్చారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) బీజేపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి విమర్శించారు. రాహుల్ వాదనలో విశ్వసనీయత ఉంది కాబట్టే ఓట్ చోరీపై సమాధానం చెప్పకుండా.. రాజకీయ సవాళ్లను విసురుతున్నారని ఆక్షేపించారు.