Share News

Congress Protests: పెల్లుబికిన కాంగ్రెస్‌ నిరసన

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:51 AM

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై ఎన్డీఏ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Congress Protests: పెల్లుబికిన కాంగ్రెస్‌ నిరసన

  • బీజేపీరాష్ట్ర కార్యాలయ ముట్టడికి యత్నం

  • గాంధీభవన్‌ గేట్లు మూసేసిన పోలీసులు

  • మోదీకి వ్యతిరేకంగా నేతల నినాదాలు

  • కేసుల పేరిట సోనియా, రాహుల్‌ను వేధిస్తున్నారని మండిపాటు

  • జిల్లాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద నిరసనలు

  • (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై ఎన్డీఏ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయకక్షతో అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల వద్ద గురువారం కాంగ్రెస్‌ నేతలు నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గాంధీభవన్‌ చేరుకున్నారు. సమీపంలోనే ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. గాంధీభవన్‌ గేట్లకు బారీకేడ్లను ఏర్పాటు చేసి కట్టడి చేశారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. మోదీ, అమిత్‌షా డౌన్‌ డౌన్‌... జై కాంగ్రెస్‌.. రాహుల్‌గాంధీ నాయకత్వం జిందాబాద్‌.. అంటూ నినాదాలు చేశారు. గంటపాటు ఆందోళన కొనసాగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ దేశ కోసం త్యాగం చేసిన కుటుంబంపై ఎన్డీఏ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని, బీజేపీ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈడీ వేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ మాట్లాడుతూ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని, నేషనల్‌ హెరల్డ్‌ కేసు విషయంలో అదే జరిగిందన్నారు. బీజేపీ పెడుతున్న అక్రమ కేసులపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. కాగా, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిచేందుకు నేతలు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ నేతలు వస్తే తడాఖాచూపిస్తామంటూ బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని నిల్చోవడం.. యుద్ధ వాతావరణాన్ని తలపించింది. చివరకు నవీన్‌ను పోలీసులు అక్కడి నుంచి పంపించేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.


పలు జిల్లాల్లో ఉద్రిక్తత

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ చేపట్టిన బీజేపీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. మహబూబ్‌నగర్‌లో బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టేందుకుయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. వనపర్తి జిల్లాలోని బీజేపీ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనరెడ్డి తదితరులు ధర్నా చేశారు. నాగర్‌కర్నూల్‌ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. వరంగల్‌ జిల్లాలో బీజేపీ జిల్లా కార్యదర్శి రాణాప్రతా్‌పరెడ్డి కారును అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు యత్నించారు. ఇంతలో బీజేపీ నాయకులు అక్కడికి చేరుకోవడంతోఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం ఎమ్మెల్యేలు ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. నల్లగొండలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్‌ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. కొందరు కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా.. పోలీసు లు అడ్డుకున్నారు. జగిత్యాలలో మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, ఆసిఫాబాద్‌లో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. సిరిసిల్లలో బీజేపీ కార్యాలయం వద్దకు కాంగ్రె స్‌ నేతలు చేరుకోగా.. తోపులాట చోటు చేసుకుంది.

Updated Date - Dec 19 , 2025 | 04:51 AM