Share News

Congress By Election: జూబ్లీహిల్స్‌కు నలుగురి పేర్లు!

ABN , Publish Date - Oct 06 , 2025 | 04:13 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థిత్వానికి నలుగురు నేతల పేర్లను ఇన్‌చార్జి మంత్రులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. స్థానిక నేతలు నవీన్‌....

Congress By Election: జూబ్లీహిల్స్‌కు నలుగురి పేర్లు!

  • ప్రతిపాదించిన ఇన్‌చార్జి మంత్రులు

  • జాబితాను 3 పేర్లకు కుదించే అవకాశం

  • ఉప ఎన్నిక ప్రచారంపై మీనాక్షి, మహేశ్‌గౌడ్‌ సమీక్ష

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థిత్వానికి నలుగురు నేతల పేర్లను ఇన్‌చార్జి మంత్రులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. స్థానిక నేతలు నవీన్‌ యాదవ్‌, సీఎన్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌ల పేర్లను వారు ప్రతిపాదించినట్లు సమాచారం. గెలిచే అవకాశం ఉన్న నేతల పేర్లను ప్రతిపాదించాల్సిందిగా ఉప ఎన్నికకు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు, వివేక్‌ వెంకటస్వామికి సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నాలుగు పేర్లను ప్రతిపాదిస్తూ టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు వారు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌ ఆదివారం ఢిల్లీకి వెళ్లడానికి ముందు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌తో భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌ సూచన మేరకు జరిగిన ఈ భేటీలో ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణతోపాటు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ప్రతిపాదించిన నాలుగు పేర్ల పైనా ప్రాథమికంగా చర్చించారు. దీనిపై సోమవారం లేదా మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితో భట్టివిక్రమార్క, మహేశ్‌గౌడ్‌, మీనాక్షీ నటరాజన్‌, మంత్రి ఉత్తమ్‌ సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది. సర్వేలు, నివేదికల ఆధారంగా ఆశావహుల జాబితాను షార్ట్‌లిస్ట్‌ చేసి మూడు పేర్లతో అధిష్ఠానానికి ప్రతిపాదన పంపనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న తీరుపై మీనాక్షీ నటరాజన్‌, మహేశ్‌గౌడ్‌ ఆదివారం ప్రజాభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల, డివిజన్ల వారీ ఇన్‌చార్జులుగా ఉన్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఎన్నికల ప్రచారం వ్యక్తి కేంద్రీకృతంగా కాకుండా పార్టీ, సిద్ధాంతం కేంద్రీకృతంగా సాగాలని మహేశ్‌గౌడ్‌, మీనాక్షి సూచించారు. అభ్యర్థిని సర్వేల ఆధారంగా అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

Updated Date - Oct 06 , 2025 | 07:43 AM