Congress on High Alert: కాంగ్రెస్ అలర్ట్!
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:41 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊహించిన దానికన్నా ఎక్కువ ఉత్కంఠ రేపుతోంది. ప్రచారపర్వం కొనసాగుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది.....
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్
పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం
ప్రచార సరళిపై ఆరా తీస్తున్న అధిష్ఠానం!
ఈ వారం రోజులూ ఉప ఎన్నిక క్షేత్రంలోనే ఉండనున్న మంత్రులు, ముఖ్య నాయకులు
కులాలు, వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు
ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జి
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊహించిన దానికన్నా ఎక్కువ ఉత్కంఠ రేపుతోంది. ప్రచారపర్వం కొనసాగుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ఉప ఎన్నిక హోరాహోరీగా జరగనున్నట్లు పలు సర్వే సంస్థలు అంచనా వేయడంతో.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా అప్రమత్తమైంది. మంత్రుల నుంచి డివిజన్ల వారీగా ఇన్‌చార్జులు, కులాలు, వర్గాల వారీగా ఓటర్లను ప్రభావితం చేయగల నేతలను రంగంలోకి దించి.. ప్రచార హోరును మరింత ఉధృతం చేసింది. ముఖ్యంగా నియోజకవర్గంలోని ప్రతి ఓటరునూ మరోసారి కలిసి నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ఏ మేరకు కృషి చేయనున్నదీ వివరించాలని నిర్ణయించింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రచారంలో ప్రతిపక్షాలపై విమర్శల డోసు పెంచారు. ఈ ఉప ఎన్నికను సీఎంతోపాటు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా చాలా సీరియ్‌సగా తీసుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ నేరుగా రంగంలోకి దిగి ఈ ఎన్నిక విషయంలో అధిష్ఠానం ఎంత సీరియ్‌సగా ఉందో వివరిస్తున్నారు. మహిళా ఓటర్లను కలిసేందుకు ఏడుగురు మహిళా ముఖ్యనేతలతో కమిటీని నియమించారు. ఈ కమిటీలో మీనాక్షీ నటరాజన్, ఎంపీలు రేణుకాచౌదరి, కడియం కావ్య, ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతీరెడ్డి, యశస్వినీరెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు.వీరిలో ఒక్కో ముఖ్యనేతకు సహకరించేందుకు మరో 9 మంది చొప్పున మహిళా నేతలను కేటాయించారు. వీరితోపాటు మహిళా ఓటర్లను కలిసే బాధ్యతను మీనాక్షీ నటరాజన్ కూడా తీసుకున్నారు. మొత్తంగా.. ఈ వారం రోజులూ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం యావత్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మోహరించనుంది.
ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సీఎం..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకీ కూడా కీలకం కావడంతో దీనిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నియోజకవర్గంలోని ఒక్కో డివిజన్ బాధ్యతను ఇద్దరేసి మంత్రులకు అప్పగించారు. ఆయా డివిజన్లలో ప్రచారం మొదలుకొని.. ఎన్నికల నిర్వహణ వరకు బాధ్యతలను వారిపై పెట్టారు. ఆయా మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్న తీరును, డివిజన్ల వారీగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మంత్రులతో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై.. ఈ ఉప ఎన్నిక పార్టీకి, ప్రభుత్వానికి, మంత్రివర్గానికి ఎంత కీలకమన్నది వివరించారు. అలసత్వం వహిస్తే అందరమూ నష్టపోతామని హెచ్చరించారు. అధిష్ఠానం కూడా ఉప ఎన్నిక ప్రచార సరళిపై, మంత్రులు, నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటోందని, అలసత్వం వహించిన వారు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సీఎం అప్రమత్తం చేసినట్లు తెలిసింది. పోలింగ్ రోజు దాకా ఎన్నికల క్షేత్రంలోనే ఉండి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా స్వయంగా తాను కూడా ప్రచార బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇప్పటికే మూడు రోజులు ప్రచారం చేసిన సీఎం.. బుధవారం కూడా కొనసాగించనున్నారు. మరో రోజు కూడా సీఎం ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు మంత్రులంతా ఇన్‌చార్జిగా తమకు కేటాయించిన డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఓవైపు తమ శాఖల నిర్వహణకు సమయం కేటాయిస్తూనే ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణకుమార్, తుమ్మల నాగేశ్వర్‌రావు, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్ ఆయా డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
వంద మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జి..
నియోజకవర్గంలోని ఓటర్లలో చాలా మంది స్థానికంగా నివసించడంలేదు. దీంతో ప్రతి వంద మంది ఓటర్లకు ఒక నేతను ఇన్‌చార్జిగా పెట్టి.. వారిని పోలింగ్ కేంద్రాల వరకూ రప్పించే బాధ్యతను వారికి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాగా, ఈ ఎన్నికల్లో పనితీరును బట్టే కార్పొరేషన్ చైర్మన్లుగా కొనసాగించడం ఉంటుందని ఆయా నేతలకు మీనాక్షీ నటరాజన్ స్పష్టం చేశారు.
కులాలు.. వర్గాల వారీగా సమావేశాలు!
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కులాలు, వర్గాల వారీగా ప్రభావితం చేసే నాయకులను రంగంలోకి దించి.. సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. ముఖ్యంగా ముస్లింలు, ఎస్సీ, బీసీ.. కమ్మ, రెడ్డి, మహిళా ఓటర్లపై దృష్టి పెట్టి సమావేశాలను నిర్వహిస్తోంది. ముస్లింలలో అత్యంత ప్రభావం చూపగల ఎంఐఎంతో సంప్రదింపులు జరిపి.. ఆ పార్టీ మద్దతు కూడగట్టింది. అలాగే టీజేఎస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ మద్దతు ప్రకటించాయి. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింల మద్దతు కూడగట్టేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. వాస్తవానికి గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి గెలిచినా.. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. ఈ రెండు నియోజకవర్గాల్లోని మెజారిటీ ముస్లింలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఉన్నందునే ఇది సాధ్యమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ బీసీ కావడంతో వివిధ బీసీ సంఘాల నేతలు ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే మున్నూరుకాపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇతర కాపు నాయకులు ఇటీవల ఆ సామాజికవర్గం వారితో సమావేశమయ్యారు. అలాగే కమ్మ సామాజికవర్గ ఓటర్లను ఆకర్షించేందుకు మంత్రి తుమ్మల, ఇతర కమ్మ సామాజికవర్గ నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎల్లారెడ్డిగూడలో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి దామోదర పాల్గొన్నారు. రెడ్డి సామాజికవర్గ ఓటర్లతో సమావేశమై మద్దతు కూడగట్టే బాధ్యతను ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆ సామాజిక వర్గ మంత్రులకు అప్పగించినట్లు చెబుతున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ తదితర బ్రాహ్మణ వర్గానికి చెందిన నేతలు.. ఆ సామాజికవర్గ ఓటర్లను ప్రస న్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.