BJP Telangana president Ramchander Rao: బీసీ సంక్షేమంపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:37 AM
బీసీల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేస్తున్నామంటూ...
వసతి గృహాల్లో కనీస వసతులు లేవు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): బీసీల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేస్తున్నామంటూ ప్రభుత్వం పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నా.. వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని అన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు, పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. మహర్షి వాల్మీకి వారసత్వానికి సంబంధించిన వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గద్వాల ప్రాంతంలో బోయ వాల్మీకులకు కనీసం కుల ధ్రువపత్రాలు కూడా ఇవ్వడంలేదని పేర్కొన్నారు. ‘సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థలు అస్తవ్యస్తంగా మారాయి. దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు గురుకులాల విద్యాలయాల్లో చదువుతున్నారు. కానీ వారికి తినడానికి సరైన భోజనం లేదు. సురక్షితమైన భవనాలు లేవు. ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు, గురుకులాలు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో యజమానులు భవనాలకు తాళాలు వేస్తున్నారు’ అని రాంచందర్‌రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాల విద్యార్థుల కోసం గురుకులాల్లో అన్ని వసతులు కల్పించేందుకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.