Chamala Kiran Kumar Reddy: తెలంగాణకు యూరియా ఇవ్వకుండా వివక్ష
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:37 AM
తెలంగాణకు యూరియా ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.
నేడు పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇస్తాం: చామల
న్యూఢిల్లీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు యూరియా ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. ఇదే అంశంపై సోమవారం పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇస్తామని, మకరద్వారం వద్ద నిరనస తెలుపుతామని చెప్పారు. ఆదివారం ఢిల్లీలో చామల మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కేంద్రం మాత్రం ఉద్దేశపూర్వకంగానే యూరియా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ‘తెలంగాణకు ఖరీఫ్ సీజన్‌లో 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. జూలై వరకు 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉంది.
కానీ ఇప్పటివరకు కేంద్రం కేవలం 4.36 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చింది. సకాలంలో యూరియా అందించాలని సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోపాటు నేను కూడా కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు వినతి పత్రాలిచ్చాం. కానీ కేంద్రం స్పందించలేదు’ అని చెప్పారు. ఈ విషయమై పార్లమెంటులో చర్చకు పట్టుపడతామని, రైతుల పక్షాన కేంద్రాన్ని నిలదీస్తామని తెలిపారు.