Share News

Congress Party: జీ రామ్‌ జీపై కాంగ్రెస్‌ జంగ్‌ సైరన్‌!

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:41 AM

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంతో పాటు ఆ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది....

Congress Party: జీ రామ్‌ జీపై కాంగ్రెస్‌ జంగ్‌ సైరన్‌!

  • దేశవ్యాప్త పోరుకు సిద్ధమైన హస్తం పార్టీ

  • నేడు ఇందిరా భవన్‌లో సీడబ్ల్యూసీ సమావేశం

  • ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌, మంత్రి దామోదర

న్యూఢిల్లీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంతో పాటు ఆ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శనివారం న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించనుంది. పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించి, దానిని ‘జీ రామ్‌ జీ’గా మార్చడం వెనుక ఉన్న రాజకీయ కుట్రను ప్రజలకు వివరించడమే కాకుండా, రాష్ట్రాలపై కేంద్రం మోపుతున్న అదనపు ఆర్థిక భారంపై అవగాహన కల్పించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రే సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే, తెలంగాణ నుంచి సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు సమావేశంలో పాల్గొననున్నారు. కాగా, భారత మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్‌సింగ్‌ సేవలను గుర్తు చేసుకున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - Dec 27 , 2025 | 04:41 AM