Congress MLAs : రేవంత్‌రెడ్డి పేరు చిరస్థాయిగా నిలుస్తుంది
ABN , Publish Date - Mar 19 , 2025 | 06:53 AM
ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. రేవంత్‌కు ధన్యవాదాలు
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. శాసనసభలో మంగళవారం ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. వర్గీకరణతో ఎవరికీ నష్టం లేదని, ఏ వర్గానికి వ్యతిరేకం కాదని అన్నారు. జనాభా ప్రాతిపదికన అవకాశాలను పంచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి పేరు చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు మాట్లాడుతూ.. 2011 తరువాత కూడా ఎస్సీల జనాభా పెరిగిందని, దానిని కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దాని ప్రకారం రిజర్వేషన్‌ల శాతాన్ని పెంచాలన్నారు. వర్గీకరణలో కులాల కూర్పు విషయంలో పునరాలోచన చేయాలన్నారు. కాగా, ఏళ్ల తరబడి మాదిగలు అసమానతకు గురయ్యారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. వర్గీకరణతో అందరికీ న్యాయం జరుగుతుందని, మాదిగ, మాలలు అందరం కలిసుందామని పిలుపునిచ్చారు.వర్గీకరణ పోరాటంలో అమరులైన వారి ఆత్మకు ఇక శాంతి చేకూరుతుందని కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య అన్నారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం కాంగ్రెకు చెందిన మాదిగ ఎమ్మెల్యేలు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. మరోవైపు మంత్రి దామోదర రాజనర్సింహ.. సభలో బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలను కలిసి వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
వర్గీకరణ అమలయ్యాకే స్థానిక ఎన్నికలు జరపాలి: ప్రశాంత్‌రెడ్డి
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తీసుకొచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 నవంబరు 29న అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని గుర్తుచేశారు. ఇదే విషయంపై ప్రధాని మోదీని కూడా కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. అయినా కేంద్రం నాన్చివేత ధోరణితో వర్గీకరణకు ఇంతకాలం పట్టిందన్నారు.
సీపీఎం హర్షం..
శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లుల ఆమోదంపై సీపీఎం హర్షం వ్యక్తం చేసింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.