Congress Telangana: సీనియర్లను పక్కనపెడతారా
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:48 AM
కార్యకర్తలకు న్యాయం చేసేందుకే వారి డిమాండ్ మేరకు మంత్రి పదవి అడుగుతున్నా తప్పా పదవీ వ్యామోహంతో కాదు.
అన్యాయం జరుగుతున్నా పార్టీ లైన్‌లోనే ఉన్నా: మల్‌రెడ్డి రంగారెడ్డి
చాదర్‌ఘాట్, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ‘పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పతనమైన దశలో తిరిగి అధికారంలోకి తెచ్చాం. పార్టీకి కార్యకర్తలే బలం. కార్యకర్తలకు న్యాయం చేసేందుకే వారి డిమాండ్ మేరకు మంత్రి పదవి అడుగుతున్నా తప్పా పదవీ వ్యామోహంతో కాదు. ఇచ్చిన జిల్లాలకే రెండు, మూడు మంత్రి పదవులిస్తున్నారు. రాష్ట్రంలోనే దాదాపు 40 శాతం జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు గతంలో ఆరుగురు మంత్రులున్నారు. ఇప్పుడు ఆ జిల్లాలను పట్టించుకోవట్లేదు. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించి కాంగ్రె్‌సను అధికారంలోకి తెచ్చిన సీనియర్లను పక్కనపెట్టారు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. మలక్‌పేట తిరుమలహిల్స్‌లోని తన నివాసంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్న ప్రభాకర్‌తో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధిష్ఠానం పెద్దల సూచనలతో ప్రెస్‌మీట్ వాయిదా వేసుకున్నానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రె్‌సను కాపాడిన వారిలో తాను ముఖ్యపాత్ర పోషించానన్నారు. ‘పదవుల విషయంలో నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఓర్చుకుంటూ ఇంకా పార్టీ లైన్‌లోనే ఉన్నాను. ఇక ముందు కూడా ఉంటాను. అలాగని పార్టీ అధిష్ఠానం పొరపాట్లు చేయవద్దని కోరుతున్నాను. పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్లకు పదవులిస్తే కార్యకర్తలు బాధపడుతున్నారు’ అని చెప్పారు.