Minister Ponnam Prabhakar: ఇన్‌చార్జి మంత్రిగా జూబ్లీహిల్స్ బాధ్యత నాది
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:13 AM
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు, విద్యావంతుడని, అతడిని గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు....
స్థానికుడు, విద్యావంతుడైన నవీన్‌ను గెలిపించాలి
ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు, విద్యావంతుడని, అతడిని గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రిగా జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత తనదని అన్నారు. యూసు్‌ఫగూడ డివిజన్‌లోని శ్రీకృష్ణ నగర్‌లో గురువారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ.. నవీన్ యాదవ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కొకరికి 6కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తోపాటు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని గుర్తు చేశారు. వడ్డీలేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తూ మహిళలకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు. అనంతరం కాపు సంఘం నాయకుల నివాసంలో అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు. నవీన్ యాదవ్‌కు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించిన కాపు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ మాదిరిగానే.. జూబ్లీహిల్స్‌లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. కాగా, బీఆర్‌ఎస్ బలం తగ్గిపోవడంతో ఫేక్ సర్వేలు చేయిస్తోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్, బీజేపీ దొంగ పార్టీలని, వాటిని నమ్మొద్దని కోరారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి కోసం బీజేపీ పనిచేస్తోందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఆరోపించారు. ఫేక్ సర్వేలతో ప్రజల అభిప్రాయం మారదని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.