Harish Rao: కాంగ్రెస్ నేతలు లక్ష చీరలు పంచుతున్నారు!
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:38 AM
జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు.. లక్ష పట్టు చీరలు పంచుతున్నారు. కుక్కర్లు, మిక్సీ గ్రైండర్లను తాయిలాలుగా ఇస్తూ..
విచ్చలవిడిగా డబ్బులు, మద్యాన్ని పారిస్తున్నారు
సీఈఓకు మాజీ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు..
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు.. లక్ష పట్టు చీరలు పంచుతున్నారు. కుక్కర్లు, మిక్సీ గ్రైండర్లను తాయిలాలుగా ఇస్తూ.. అధికార కాంగ్రెస్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోంది. విచ్చలవిడిగా డబ్బులను పంచుతూనే.. మద్యాన్ని ఏరులై పారిస్తూ.. కాంగ్రెస్ అక్రమ మార్గంలో గెలవాలని చూస్తోంది. ఆ పార్టీ ఎన్నికల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోండి..’ అని సీఈఓ సుదర్శన్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో సీఈఓను ఆయన కలిసి వినతి ప్రతంతో పాటు సాక్ష్యాలుగా పలు ఫొటోలు, వీడియో క్లిప్పింగులను సమర్పించారు. ఆనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. పోలీసులు, అధికారులు తొత్తులుగా మారి వారి అక్రమాలకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. సీ విజిల్ యాప్‌లో, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. కాంగ్రెస్ లక్షకుపైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తున్న సమాచారాన్ని వీడియో, ఫొటో ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు తెలిపారు. అలాగే ఫేక్ ఓటర్ ఐడీలు తయారు చేశారని, ఫేక్ ఐడీ కార్డుల వీడియోను సమర్పించామన్నారు. ఓటరు గుర్తింపు కార్డును నిర్ధారించకుండా ఎవరినీ పోలింగ్ బూత్‌లోకి పంపొద్దని.. దొంగ ఓట్లను అడ్డుకోవాలని కోరామని చెప్పారు. యూసు్‌ఫగూడలో కాంగ్రెస్ కార్యాలయానికి ఆనుకొనే పోలింగ్ బూత్ ఉందని సీఈఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనిపై తగిన చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చినట్లు హరీశ్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఓటర్లు తెలివైన వారని, అధికార కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మోసపోకుండా.. ఆ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీనిచ్చి మోసం చేసిన సీఎం రేవంత్ రెండేళ్లుగా ఆరు గ్యారెంటీలపై సమీక్ష జరిపేందుకు సమయం దొరకలేదా..? అని ప్రశ్నించారు.