Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ బ్రోకర్
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:34 AM
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డిని ఓడించి తీరతానన్న మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్‌సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్‌పై...
భ్రమల్లో బతికే విఫల రాజకీయ నేత
సీఎం రేవంత్‌రెడ్డిపై లేనిపోని ఆరోపణలు
తెలంగాణలో మళ్లీ గెలిచేది కాంగ్రెస్సే
ఆయన జేజమ్మ దిగివచ్చినా ఆపలేరు
పీకేపై కాంగ్రెస్ నేతల మండిపాటు
హైదరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డిని ఓడించి తీరతానన్న మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్‌సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రశాంత్ కిశోర్ ఒక పొలిటికల్ బ్రోకర్ అని, భ్రమల్లో బతికే విఫల రాజకీయ నాయకుడని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్, మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తనను మించిన తెలివి గలవారు దేశంలోనే లేరనే భ్రమతో పీకే రాజకీయ విశ్లేషణలు చేస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, ప్రశాంత్ కిశోర్ జేజమ్మ దిగివచ్చినా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిశోర్ ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిహార్ డీఎన్‌ఏ నాసిరకమంటూ బిహార్ ప్రజలను రేవంత్‌రెడ్డి అవమానించారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌తో పోల్చుకుంటూ రేవంత్‌రెడ్డి 2023లో ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. కేసీఆర్‌ది బిహార్ డీఎన్‌ఏ అని, తనది తెలంగాణ డీఎన్‌ఏ అని, ముఖ్యమంత్రి పదవికి తానే అర్హుడినని చెబుతూ రేవంత్‌రెడ్డి బిహారీలను హేళన చేశారని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఎన్నికల వ్యూహాల కోసం బిహారీనైన తన వద్దకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఇందుకు రేవంత్‌ను ఈసారి ఓడించి తమ సత్తా చూపిస్తామని ప్రకటించారు. ప్రశాంత్ కిశోర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ప్రశాంత్ కిశోర్ మహా నాయకుడిగా మారతానంటూ పార్టీ పెట్టారని, కానీ.. పార్టీ సిద్ధాంతాలతో బిహార్ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. దీంతో ప్రజల దృష్టిని తనవైపు మళ్లించుకునేందుకు బిహార్ సెంటిమెంట్‌ను వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డిపై లేనిపోని ఆరోపణ చేస్తున్నారని తెలిపారు. ఎన్నిలకు ముందు బిహార్ ప్రజలను పోలరైజ్ చేయడానికి రేవంత్‌రెడ్డి పేరును వాడుతున్నారని తప్పుబట్టారు. పక్క రాష్ట్రాల సీఎంలనుద్దేశించి తప్పుగా మాట్లాడి బిహార్‌లో ఓట్లు సంపాదించాలనుకోవడం సరికాదన్నారు. ప్రశాంత్ కిశోర్‌కు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి అనుభవం, అవగాహన లేవన్నారు. తెలంగాణ రాష్ట్రం తిరుగుబాటుకు, ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఇక్కడి ప్రజలకు పొలిటికల్ బ్రోకర్ల అవసరం లేదని పేర్కొన్నారు. తన సొంత రాష్ట్రంలో ప్రజల విశ్వాసాన్ని పొందలేని వ్యక్తి.. ఇతర రాష్ట్రాల రాజకీయాలపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మరోవైపు ‘సభ్యత లేని మాటలు మాట్లాడే వారిని సభ్యత లేనివారు అనే అంటారు’ అని బిహార్‌కే చెందిన కాంగ్రెస్ నేత కన్హయ్యకుమార్ వ్యాఖ్యానించారు. ఎన్‌ఎ్‌సయూఐకి ఏఐసీసీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కన్హయ్య.. ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఇలా జవాబిచ్చారు.