Congress Leaders Criticize KTR: ఫార్ములా ఈ రేసు కేసు తప్పు దారి పట్టించడానికే..
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:59 AM
సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ కుటుంబాన్ని బ్లేమ్ చేయడం తప్ప...
సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆరోపణలు: కాంగ్రెస్ నేతల ధ్వజం
కేసీఆర్‌లా సొంత వారికి సీఎం రేవంత్ పదవులిచ్చారా: చామల
మతి తప్పి పులికేశిలా: బల్మూరి
తెలంగాణను సొంత ఎస్టేట్‌లా భావిస్తున్న కేటీఆర్: చనగాని
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ కుటుంబాన్ని బ్లేమ్ చేయడం తప్ప ఆయనకు మరో పనేమీ లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ మాదిరిగా సీఎం రేవంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులకేమైనా పదవులిచ్చారా? అని శుక్రవారం ఓ ప్రకటనలో కేటీఆర్‌ను నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడేమీ చేయకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి సహకరించక పోగా వ్యాపారవేత్తలను బెదిరించడమేమిటని, వ్యవస్థ ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు ఓడించినా ఆయనకు బుద్ది రాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. ఫార్ములా- ఈ రేసు కేసుపై సమాధానమివ్వలేక.. ఆ కేసును తప్పు దారి పట్టించడానికే సీఎం రేవంత్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ కేసుపై ఏసీబీ అధికారులు ప్రశ్నించినప్పుడు ఒక మాట, బయటొక మాట మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్న బల్మూరి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంతో మతి తప్పిన కేటీఆర్.. పులికేశిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫార్ములా-ఈ రేసు కేసు విచారణను ఎదుర్కొనేందుకు కేటీఆర్ భయ పడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణను సొంత ఎస్టేట్‌లా భావిస్తున్న కేటీఆర్.. ఇకనైనా అది మానుకుని హుందాతనంతో వ్యవహరించాలని హితవు చెప్పారు. బీఆర్‌ఎ్‌సలో కేటీఆర్, హరీశ్‌రావు ఆధిపత్య పోరు నడుస్తోందని, బల ప్రదర్శనలో ఇద్దరూ పోటీ పడుతున్నారని అన్నారు.