Share News

Congress Leaders Clash Over Voter: కాంగ్రెస్‌ నేతల బాహాబాహీ

ABN , Publish Date - Oct 22 , 2025 | 04:37 AM

ఓటరు జాబితా విషయంలో ఇద్దరు నేతల మధ్య చోటుచేసుకున్న వివాదం.. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నువ్వెంత.. అంటే నువ్వెంత అంటూ...

Congress Leaders Clash Over Voter: కాంగ్రెస్‌ నేతల బాహాబాహీ

  • ఓటరు జాబితాపై ఇద్దరు నేతల ఘర్షణ

బోరబండ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా విషయంలో ఇద్దరు నేతల మధ్య చోటుచేసుకున్న వివాదం.. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నువ్వెంత.. అంటే నువ్వెంత అంటూ ఒకరినొకరు అసభ్యపదజాలంతో దూషించుకోవడం, ఒకానొక దశలో తోపులాటతోపాటు బాహాబాహీకి దిగడంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌ రహమత్‌నగర్‌ డివిజన్‌లోని రాజీవ్‌గాంధీనగర్‌ బస్తీలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎస్పీఆర్‌ హిల్స్‌లోని రాజీవ్‌గాంధీనగర్‌, ఆరోగ్యనగర్‌ బస్తీల్లో మంత్రి వివేక్‌ వెంకటస్వామి, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మ న్లు, నాయకులు ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం తర్వాత మంత్రి, అభ్యర్థి, కార్పొరేషన్‌ చైర్మన్లు వెళ్లిపోగా, రాజీవ్‌గాంధీనగర్‌ బస్తీ అధ్యక్షుడు శాంతికుమార్‌ నివాసంలో నాయకులు, కార్యకర్తలు భోజనాలు చేశారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని కొన్ని బూత్‌లకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మాదాపూర్‌ డివిజన్‌ నేత దేవావత్‌ నగేష్‌ నాయక్‌.. అక్కడకు రాగా.. ఓటరు జాబితా విషయంలో తనపై ఫిర్యాదు చేస్తావా? అంటూ బస్తీ నాయకుడు ఎత్తరి అంతయ్య వాగ్వాదానికి దిగారు. సీఎం సలహాదారు నరేందర్‌రెడ్డి పంపితేనే ఇక్కడ ప్రచారానికి వచ్చానని, తనతో అసభ్యంగా మాట్లాడొద్దని నగేష్‌ వారించినా.. అంతయ్య వినిపించుకోలేదు. నగేష్‌ నాయక్‌పై దాడికి ప్రయత్నించారు. ఘటనపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామంటూ నగేష్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Oct 22 , 2025 | 04:37 AM