Congress Leader Anjan Kumar Upset: అంజన్ అలక.. బుజ్జగింపు!
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:58 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక.. ఆశావహులను అసంతృప్తికి గురిచేసింది. తమకు టికెట్ దక్కనందుకు వారు అలకబూనడంతో అధిష్ఠానం....
జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహం.. స్థానికుడే అభ్యర్థి అన్నది వంక మాత్రమే
కామారెడ్డి, మల్కాజిగిరిలో స్థానికేతరుడు పోటీ చేయలేదా?
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎక్కడైనా పోటీ చేయొచ్చు: అంజన్‌కుమార్
వెంటనే అంజన్ కార్యాలయానికి మీనాక్షి, మంత్రులు పొన్నం, వివేక్
బుజ్జగింపు.. మెత్తబడ్డ అంజన్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక.. ఆశావహులను అసంతృప్తికి గురిచేసింది. తమకు టికెట్ దక్కనందుకు వారు అలకబూనడంతో అధిష్ఠానం ప్రతినిధులు రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది. ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ అలకబూనడం పార్టీని ఆందోళనకు గురి చేసింది. తనకు టికెట్ దక్కకపోవడంపై శుక్రవారం ఉదయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అంజన్‌కుమార్.. కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానంటూ బాంబు పేల్చారు. దీంతో అప్రత్తమైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఆయన కార్యాలయానికి వెళ్లి బుజ్జగించారు. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై సర్వేలు నిర్వహిస్తున్నప్పుడే.. టికెట్ తనకే ఇవ్వాలని, గెలిచాక మంత్రి పదవీ ఇవ్వాలని అంజన్‌కుమార్ డిమాండ్ చేసిన విష యం తెలిసిందే. అనంతరం నియోజకవర్గ ఓటర్లకు హామీలిస్తూ అంజన్‌కుమార్ పేరిట పోస్టర్లు వెలిశాయి. టికెట్ రేసులో ఆయన చివరిదాకా పోటీ పడ్డారు. అయితే పలు అంశాల ఆధారంగా అధిష్ఠానం.. నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా బుధవారం ప్రకటించింది. దీనిపై గురువారం మౌనంగానే ఉన్న అంజన్‌కుమార్.. శుక్రవారం తన అసంతృప్తిని బయటపెట్టారు.
ఒరిజినల్ నేతలకు 200 శాతం అన్యాయం
తన కార్యాలయంలో అంజన్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఫలానా అభ్యర్థిని నిర్ణయిస్తున్నట్లుగా తనకు మాట వరసకైనా చెప్పలేదన్నారు. గతంలో ఒకాయన కామారెడ్డి, మల్కాజిగిరిలో పోటీ చేసినప్పుడు రాని లోకల్, నాన్‌లోకల్ సమస్య.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చునని చెప్పారు. స్థానిక అభ్యర్థి అన్నది ఒక వంక మాత్రమేనన్నారు. తనకు టికెట్ రాకుండా చేసిందెవరో తర్వాత చెబుతానన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేశానని, కనీసం జూబ్లీహిల్స్ కమిటీలోకి కూడా తనను తీసుకోలేదని తప్పుబట్టారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు రెండొందల శాతం అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. దీంతో విషయం తెలుసుకున్న మీనాక్షీ నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి.. అంజన్ కార్యాలయానికి వెళ్లి ఇది అధిష్ఠానం నిర్ణయమని చెప్పారు. భవిష్యత్తులో ప్రాధాన్యం ఇస్తామని నచ్చజెప్పారు. మీనాక్షి బుజ్జగింపుతో మెత్తబడ్డ అంజన్.. మధ్యాహ్నానికి అలక వీడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ చర్యలతో తాను మనస్తాపానికి గురయ్యాన ని, కానీ.. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే తనకు ముఖ్యమని అన్నారు. అయితే పార్టీ కష్టకాలం లో వెంట ఉన్న తనను ఇప్పుడు పక్కన పెడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు.
ముషీరాబాద్‌లో గెలిస్తే మంత్రి అయ్యేవారు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అంజన్‌కుమార్‌యాదవ్.. అప్పుడు గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రె్‌సకు అంజన్‌కుమార్ పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారని తెలిపారు. కంటోన్మెంట్‌లో గెలిచినట్లుగానే.. జూబ్లీహిల్స్‌లోనూ కాంగ్రెస్ గెలవబోతోందని, అంజన్‌కుమార్ ముందుండి పార్టీని నడిపిస్తారన్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ మరో ఇద్దరు నేతలు రహమత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ గుర్రం మురళీగౌడ్ గురువారం నుంచి పార్టీ అగ్రనేతలకు ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. దీంతో శుక్రవారం సాయంత్రం మంత్రులు వివేక్, పొన్నం, ఏఐసీసీ ఎన్నికల ఇన్‌చార్జి విశ్వనాథన్ తదితరులు సీఎన్‌రెడ్డి, మురళీగౌడ్ ఇళ్లకు వెళ్లారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని, మున్ముందు సముచిత గౌరవం దక్కేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక మరో ఆశావహురాలు కంజర్ల విజయలక్ష్మితోనూ మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆమె అందుబాటులోకి రాలేదని సమాచారం. ఇదిలా ఉండగా.. అంజన్ అలకబూనడం, మీనాక్షి వెళ్లి బుజ్జగించడం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.