బీసీలను మోసగిస్తున్న కాంగ్రెస్
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:46 PM
ఎన్నికలకు మందు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్‌పార్టీ మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్ మండిపడ్డారు.
- 14న బందుకు సంపూర్ణ మద్దతు
- మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
వెల్దండ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికలకు మందు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్‌పార్టీ మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన వెల్దండలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన మోసానికి నిరసనగా, బీసీ రిజర్వేషన్లు సాధించే దిశగా ఈనెల 14న చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బందుకు బీఆర్‌ఎస్‌పార్టీ సంపూర్ణ మద్దతు తెలపనుందని పేర్కొన్నారు. ఎటువంటి రాజ్యాంగ భద్రత కల్పించకుండా కేవలం అసెంబ్లీలో తీర్మానంచేసి జీవో 9ని తెరమీదకు తెచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 42 శాతం రిజర్వేషన్లపేరిట స్థానిక సంస్థల ఎన్నికలకు హడావిడి చేసిన కాంగ్రెస్ చివరకు ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టేవిధించిందని తెలిపారు. రాజ్యాంబద్ధంగా రిజర్వేషన్లు సాధించాలని, కేవలం బీసీలను మోసంచేసేందుకే రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలను ప్రతీ ఒక్కరు తిప్పికొట్టాలని కోరారు. బందుకు అన్నివర్గాలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. సమావేశంలో పీఏసీఎస్ డైరెక్టర్ నాగులునాయక్,మాజీ ఎంపీటీసీ సభ్యుడు హన్మంత్‌నాయక్, నాయకులు నిరంజన్, ఆనంద్, అశోక్, ప్రసాద్, రాజునాయక్ తదితరులు ఉన్నారు.