Congress Highlights Welfare and Development: జూబ్లీహిల్స్‌లో లబ్ధిదారులుగా లక్ష కుటుంబాలు!
ABN , Publish Date - Oct 30 , 2025 | 05:05 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించేది తామేనని అధికార కాంగ్రెస్ పార్టీ అంటోంది. నియోజకవర్గంలో తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి...
అభివృద్ధి, సంక్షేమమే అజెండా అంటున్న కాంగ్రెస్
200 యూనిట్ల ఉచిత విద్యుత్ 25,925 కుటుంబాలకు
రూ.500 గ్యాస్ సిలిండర్ లబ్ధి కుటుంబాలు 19,658
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రూ.120 కోట్లు
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించేది తామేనని అధికార కాంగ్రెస్ పార్టీ అంటోంది. నియోజకవర్గంలో తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెబుతోంది. నియోజకవర్గంలో రాష్ట్ర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలే దాదాపు లక్ష ఉన్నాయని పేర్కొంటోంది. నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల మంది ఓటర్లుండగా.. అందులో లక్ష కుటుంబాలు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో లబ్ధి పొందుతున్నాయని అంటోంది. ఆ పార్టీ నేతలు చెబుతున్న వివరాల ప్రకారం.. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం 25,925 కుటుంబాలకు, రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 19,658 కుటుంబాలకు అందుతున్నాయి. ఇక ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలతో హైదరాబాద్‌లో ఇప్పటివరకు కోటిమందికి పైగా ప్రయాణించగా.. వారికి దాదాపు రూ.2,410కోట్లు ఆదా అయ్యాయి. అందులో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని మహిళలకు రూ.120 కోట్లు ఆదా అయింది. మరోవైపు 14,197 కొత్త రేషన్‌కార్డులు ఇవ్వడం, ఉన్న రేషన్‌కార్డుల్లో 8123 మందిని అదనంగా చేర్చడంతో పాటు మొత్తం రేషన్ కార్డుదారులందరికీ ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5కే అల్పాహారం అందించడం, ఇతర సంక్షేమ పథకాలన్నీ ఓటర్లు తమవైపు ఉండేలా చేస్తాయని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.
భారీగా అభివృద్ధి పనులు..
నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ది పనులు కూడా తమకు సానుకూలంగా ఉంటాయని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రత్యేక అభివృద్ధి నిఽధులతో రూ.5.51 కోట్లతో నియోజకవర్గంలో రోడ్లు, మౌలిక వసతుల కల్పన పనులు నిర్మాణంలో ఉన్నాయని చెబుతోంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్, రోడ్‌నెంబరు 45జంక్షన్, ఫిల్మ్‌నగర్, మహారాజా అగ్రసేన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బంది అధిగమించేలా రూ.826 కోట్ల ఖర్చుతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరు చేశామని అధికార పార్టీ చెబుతోంది. వీటితోపాటు కొత్తగా పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్ర్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 11కేవీ ఫీడర్లు, దాదాపు 13కిలోమీటర్ల మేర ఎల్‌టీ లైన్ ఆధునికీకరణ పనులకు రూ.11కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ నియోజకవ ర్గంలో రూ.162కోట్లతో అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైను వేయాలని ప్రతిపాదనలను సిద్ధం చేశామని తెలిపింది. ఈ అభివృద్ధి, సంక్షేమ పథకాలు త మ విజయానికి మార్గం సుగమం చేస్తాయని బుధవారం ఒక ప్రకటనలో కాంగ్రెస్ పేర్కొంది.