Share News

Minister Komatireddy Venkat Reddy: అసెంబ్లీకే రాని కేసీఆర్‌.. అధికారంలోకి ఎలా వస్తాడు?

ABN , Publish Date - Nov 07 , 2025 | 02:03 AM

అసెంబ్లీకే రాని కేసీఆర్‌ రెండేళ్లలో అధికారంలోకి ఎలా వస్తాడని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రశ్నించారు...

Minister Komatireddy Venkat Reddy: అసెంబ్లీకే రాని కేసీఆర్‌.. అధికారంలోకి ఎలా వస్తాడు?

  • బీఆర్‌ఎస్‌ నేతల మాటలు నమ్మితే గోస పడతారు

  • కాంగ్రెస్‌ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి

  • ఒక్క పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే ఫ్లైఓవర్‌ 50 ఫ్లైఓవర్లతో సమానం

  • జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీకే రాని కేసీఆర్‌ రెండేళ్లలో అధికారంలోకి ఎలా వస్తాడని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతల సెంటిమెంట్‌ మాటలు నమ్మితే గోస పడతారంటూ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా రహమత్‌నగర్‌ డివిజన్‌లో మంత్రి కోమటిరెడ్డి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని, పేదలను కడుపులో పెట్టుకొని కాపాడే పార్టీ కాంగ్రెస్‌ మాత్రమేనని అన్నారు. బస్తీల్లోని పేదలకు మంచి జరగాలంటే నవీన్‌ యాదవ్‌ను భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. అసలైన సర్వేలన్నీ కాంగ్రెస్‌ గెలవడం ఖాయమని చెబుతుండడంతో బీఆర్‌ఎస్‌ నేతలు నైరాశ్యంతో మాట్లాడుతున్నారని, వారి మోసపు మాటలు నమ్మొద్దని ఓటర్లను కోరారు. కాంగ్రెస్‌ హయాంలోనే హైదరాబాద్‌ మహానగర సమగ్ర అభివృద్ధి జరిగిందని పునరుద్ఘాటించారు. ఏమైనా అంటే ఫ్లైఓవర్లు నిర్మించామని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించిన 14కి.మీ పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే ఫ్లైఓవర్‌.. 50 ఫ్లై ఓవర్లతో సమానమని కోమటిరెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఏడెనిమిది చిన్న ఫ్లైఓవర్లు నిర్మించి గొప్పలు చెబుతోందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల సెంటిమెంట్‌ మాటలు నమ్మి మోసపోతే.. గోస పడతారని, ఆలోచన చేయాలని ఓటర్లను కోరారు. కంటోన్మెంట్‌లో జరుగుతున్న దానికి రెట్టింపు అభివృద్ధి జూబ్లీహిల్స్‌లో చేస్తామని స్థానిక ప్రజలకు కోమటిరెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Updated Date - Nov 07 , 2025 | 02:03 AM