IT and Industries Minister Duddilla Sridhar Babu: జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే..
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:39 AM
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు...
ప్రతిపక్షాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు
కాంగ్రె్‌సతోనే హైదరాబాద్ అభివృద్ధి: శ్రీధర్ బాబు
బంజారాహిల్స్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ ఎన్నికలో ఓటర్లు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను అప్యాయంగా పలుకరించి స్థాని క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్ హైదరాబాద్ మహా నగరాభివృద్ధిని గాలికొదిలేసిందని విమర్శించారు. నగరాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉండి, నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం తపించే నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కన్‌సింగ్ రాజ్ ఠాకూర్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.