Share News

Congress Dilemma: జూబ్లీహిల్స్‌ అభ్యర్థి ఎవరో..?

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:25 AM

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయడంలో అధికార కాంగ్రెస్‌ అయోమయంలో పడింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్‌ భార్యను...

Congress Dilemma: జూబ్లీహిల్స్‌ అభ్యర్థి ఎవరో..?

  • తేల్చడంలో కాంగ్రెస్‌ డైలమా..!

  • పెరుగుతున్న ఆశావాహులు..

  • ప్రచారంలో పలువురు నేతల పేర్లు

  • మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌.. పలువురి నేతల పేరిట పోస్టర్లు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయడంలో అధికార కాంగ్రెస్‌ అయోమయంలో పడింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్‌ భార్యను ప్రకటించగా.. అభ్యర్థితో పాటు కుటుంబ సభ్యులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. జూబ్లీహిల్స్‌ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్‌ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయడంలో డైలామాలో పడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉప ఎన్నిక అధికార కాంగ్రె్‌సకు కలిసివచ్చిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేయడానికి ఆశావాహులు పుట్టుకొస్తున్నారు. అభ్యర్థిని ఖరారు చేయడంలో ఎంత ఆలస్యమైతే.. అంతమంది నేతలు తానే అభ్యర్థినంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ పేరిట నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. ‘రావాలి అంజన్న.. కావాలి అంజన్న’ అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. ఇప్పటికే తాను జూబ్లీహిల్స్‌లో పోటీ చేయనున్నట్లు అంజన్‌కుమార్‌ ప్రకటించారు. అయితే అంజన్‌కుమార్‌ కొడుకు రాజ్యసభ ఎంపీగా ఉన్న నేపథ్యంలో వాళ్ల కుటుంబానికి మరోసారి అవకాశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మా ట్లాడుతూ తన తండ్రి పార్టీలో సీనియర్‌గా ఉన్నారని, గతంలో ఎంపీగా రెండుసార్లు గెలుపొందారని, అధిష్ఠానం ఆదేశాలిస్తే పోటీ చేసి గెలుపొందుతారని ధీమాను వ్యక్తం చేశారు. ఇక స్థానిక కాంగ్రెస్‌ యువ నేత నవీన్‌యాదవ్‌, రహమత్‌నగర్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి పేరిట కూడా పోస్టర్లు వెలిశాయి. మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీ కార్పొరేటర్‌ మురళీగౌడ్‌, మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు కంజర్ల విజయలక్ష్మి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తూనే ప్రజల మద్దతు కోసం ఎవరి దారిలో వారు ప్రచారం సాగిస్తున్నారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్‌ను పార్టీ ఫిరాయింపు అంశం వెంటాడుతున్న నేపథ్యంలో ఆయన జూబ్లీహిల్స్‌ నుంచి బరిలో నిలుస్తారనే ప్రచారం సాగుతోంది. జూబ్లీహిల్స్‌లోనే నివాసముంటున్న మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డితో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారినెవరినైనా కాంగ్రెస్‌ నుంచి రంగంలోకి దించితే ఎలా ఉంటుందన్న అంశంపై తర్జనభర్జన చేస్తున్నట్లు తెలిసింది.

ఇప్పటికే స్థానికులకేనని పొన్నం స్పష్టత

జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా స్థానికులకే అవకాశం కల్పిస్తామని, బయటి వారికి అవకాశం ఉండదని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ నెలరోజుల క్రితం విలేకర్ల సమావేశంలో కొంత వరకు స్పష్టతనిచ్చారు. దీంతో స్థానిక నేతలు నవీన్‌యాదవ్‌, సీఎన్‌రెడ్డి, మురళీగౌడ్‌, కంజర్ల విజయలక్ష్మిలకు ఆశలు పెరిగాయి.

Updated Date - Sep 17 , 2025 | 05:26 AM