Share News

Telangana Congress: డీసీసీల భర్తీలో సామాజిక న్యాయం!

ABN , Publish Date - Oct 26 , 2025 | 04:26 AM

రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ డీసీసీ అధ్యక్షుల భర్తీలో సామాజిక న్యాయం పాటించాలని, అన్నివర్గాలకు తగిన అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది....

Telangana Congress: డీసీసీల భర్తీలో సామాజిక న్యాయం!

  • అన్నివర్గాలకు తగిన అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల భర్తీలో సామాజిక న్యాయం పాటించాలని, అన్నివర్గాలకు తగిన అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. శనివారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కీలక సమావేశం జరిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్‌ రాష్ట్ర నేతల నుంచి డీసీసీ అధ్యక్షుల ఎంపికపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రె్‌సను మరింత బలోపేతం చేయడం, సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ పురోగతి, జిల్లాస్థాయి నాయకత్వ మార్పులపై చర్చించారు.

నివేదికలను ముందుపెట్టుకుని..

ఈసారి డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఏఐసీసీ ప్రత్యేకంగా అబ్జర్వర్లను నియమించిన సంగతి తెలిసిందే. 22 మంది ఏఐసీసీ అబ్జర్వర్లు రాష్ట్రంలో పర్యటించి, ఒక్కో జిల్లా నుంచి ముగ్గురు, నలుగురు పేర్లతో కూడిన నివేదికలను అధిష్ఠానానికి అందజేశారు. శనివారం భేటీలో కేసీ వేణుగోపాల్‌ ఆ నివేదికలను ముందు పెట్టుకుని రేవంత్‌, భట్టి, మహేశ్‌గౌడ్‌లతో మాట్లాడారు. జిల్లా ల్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళల కేటగిరీల్లో బలమైన నేతలు ఎవరెవరు ఉన్నారు? పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? గతంలో ఏయే పదవుల్లో ఉన్నారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో వారి పాత్ర ఏమిటనే అంశాలపై చర్చించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌ లక్ష్యమని రాహుల్‌ గాంధీ స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో.. డీసీసీల్లోనూ సామాజిక న్యాయం ఉండాలని వేణుగోపాల్‌ సూచించారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారినందున.. డీసీసీల భర్తీలోనూ ఆ దిశగా ఎంపిక ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారిని సమన్వయం చేయడం, దక్కని వారికి భవిష్యత్తులో వేరే పదవులు ఇవ్వడంపైనా ఈ భేటీలో నేతలు చర్చించినట్టు తెలిసింది. పెద్దగా వివాదాలు లేని సుమారు పది జిల్లాల అధ్యక్షుల నియామకంపై ఏకాభిప్రాయం కుదిరినట్టు సమాచారం. రెండు మూడు వారాల్లో జాబితా ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్రమంలో రాష్ట్ర నేతలను మరోసారి ఢిల్లీకి పిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో రాజకీయ పరిణామాలు, మంత్రుల మధ్య విభేదాలు, పార్టీ అంతర్గత అంశాలు, మంత్రివర్గ విస్తరణ, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపైనా భేటీలో చర్చ జరిగినట్టు పేర్కొన్నాయి.


సమర్థులకే జిల్లా అధ్యక్ష పదవులు: మహేశ్‌గౌడ్‌

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులుగా సమర్థులకే అవకాశం కల్పిస్తామని, ఎంపికలో సామాజిక న్యాయం ఉంటుందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ చెప్పారు. పార్టీలోనే కనీసం ఐదేళ్లు పనిచేసిన వారికి పదవులు వస్తాయన్నారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇతర పదవుల్లో ఉన్నవారికి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకూడదనే నిబంధన పెట్టామని వెల్లడించారు. ఇక డీసీసీ అధ్యక్షుల ఎంపికపై తమ అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానానికి తెలియజేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Updated Date - Oct 26 , 2025 | 04:26 AM