Share News

Panchayat Elections: జనవరిలో మునిసిపల్‌ ఎన్నికలు?!

ABN , Publish Date - Dec 18 , 2025 | 02:59 AM

పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్‌ పార్టీ.. ఇదే వేడిలో మునిసిపల్‌ ఎన్నికలనూ నిర్వహించాలని యోచిస్తోంది...

Panchayat Elections: జనవరిలో మునిసిపల్‌ ఎన్నికలు?!

  • ‘పంచాయతీ’ జోష్‌లో కాంగ్రెస్‌

  • పట్టణాల్లోనూ పట్టు చాటుకునే యోచన

  • క్యాబినెట్‌ భేటీలో బీసీ రిజర్వేషన్లపై చర్చ

  • పార్టీ పరంగా 42ు సీట్లపై తుది నిర్ణయం

  • మునిసిపోల్స్‌ తర్వాత పరిషత్‌ ఎన్నికలు

హైదరాబాద్‌, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్‌ పార్టీ.. ఇదే వేడిలో మునిసిపల్‌ ఎన్నికలనూ నిర్వహించాలని యోచిస్తోంది. గ్రామీణ ప్రాంతాలే కాదు.. పట్టణ ప్రాంతాల్లోనూ పార్టీకి, ప్రభుత్వానికి పట్టు ఉందని చాటేందుకు ఇదే మంచి అవకాశమని భావిస్తోంది. అన్నీ కుదిరితే.. జనవరిలోనే మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, పార్టీ పరంగా జరిగే మునిసిపల్‌ ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తోంది. వాస్తవనికి పంచాయతీ ఎన్నికల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించింది. ఇందుకోసం ప్రత్యేకంగా జీవో 9 జారీ చేసింది. అయితే, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదని, పాత రిజర్వేషన్‌ ప్రకారమే స్థానిక ఎన్నికలను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసిన కోర్టులు.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను నిలిపేశాయి. మరోవైపు.. పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.3వేల కోట్లు ఆగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆ నిధులు రాబట్టుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పాత రిజర్వేషన్‌ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మరో జీవో విడుదల చేసింది. మునిసిపల్‌, పరిషత్‌ ఎన్నికలు పార్టీ గుర్తుపై నిర్వహించే ఎన్నికలు కావడంతో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కాంగ్రెస్‌ ఉంది. వచ్చే క్యాబినెట్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలిసింది. ముందుగా మునిసిపల్‌ ఎన్నికలు, ఆ తర్వాత పరిషత్‌ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Updated Date - Dec 18 , 2025 | 02:59 AM