Congress party expressed strong confidence: కాంగ్రెస్‌లో గెలుపు ధీమా!
ABN , Publish Date - Nov 12 , 2025 | 02:56 AM
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమై ఉంది...
పోల్ మేనేజ్‌మెంట్‌లో అధికార పార్టీ సక్సెస్ .. పోలింగ్ సరళిపై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ ఆరా
అంచనాలకు మించి మెజారిటీ రావచ్చంటున్న నేతలు
సైలెంట్ ఓటింగ్‌పై బీఆర్‌ఎస్ ఆశలు
బీజేపీ డీలా..నిరుత్సాహంలో కేడర్
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమై ఉంది. అది 14న వెల్లడి కానుంది. అయితే గెలుపు తమదేనంటూ కాంగ్రెస్ ధీమా ప్రదర్శిస్తుండగా.. సైలెంట్ ఓటింగ్ తమను గెలిపిస్తుందన్న ఆశల్లో బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. బీజేపీ అభ్యర్థికి 8 శాతం కంటే తక్కువగా ఓట్లు వస్తాయంటూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తేల్చడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో నిరుత్సాహం అలముకుంది. ఓటింగ్ సరళిని ప్రధాన పార్టీల నేతలంతా నిశితంగా పరిశీలించి ఒక అంచనాకు వచ్చారు. కాగా, పోలింగ్ సరళి.. కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు, తటస్థ ఓటర్లలో అత్యధికులు తమ అభ్యర్థి వైపే మొగ్గు చూపారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గెలుపుపై వారు గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే పోలింగ్ శాతమూ పెరిగిందని, ఇది కూడా తమకు అనుకూలించే అంశమని చెబుతున్నారు. దశాబ్ద కాలం తర్వాత జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని, హైదరాబాద్ నగరంలో మరో బీఆర్‌ఎస్ సిటింగ్ సీటు తమ వశం కానుందని అంటున్నారు. సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్‌ను మించి.. కాంగ్రెస్ అభ్యర్థి 20 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించబోతున్నారని అంచనా వేస్తున్నారు.
పకడ్బందీ కార్యాచరణ..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. గత కొద్ది నెలలుగా పకడ్బందీ కార్యాచరణ అమలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు, ముఖ్యనాయకులు అందరూ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి.. పోలింగ్ సరళి ఎలా ఉందని ఎప్పటికప్పుడు ఆరా తీశారు. పార్టీ నేతలకు అవసరమైన సూచనలు చేశారు. అధికార పార్టీ కావడంతో నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తటస్థ ఓటర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ బీఆర్‌ఎ్‌సతో పోలిస్తే తాము సక్సెస్ అయ్యామని అంటున్నాయి. పార్టీ గెలుపు కోసం ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా చేయాల్సినవన్నీ చేశామని పేర్కొంటున్నాయి. ఇక దాదాపు అన్ని సర్వే సంస్థలూ ఎగ్జిట్ పోల్స్‌లో బీఆర్‌ఎస్ అభర్థి మాగంటి సునీత వెనుకబడి ఉన్నట్లు చెబుతున్నా.. ఆ పార్టీ నేతలు మాత్రం సైలెంట్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో ఉన్న ఓటర్లు బీఆర్‌ఎ్‌సకు ఓట్లు వేసినా.. బయటికి మాత్రం గుంభనంగా ఉన్నారని చెబుతున్నారు. స్వల్ప మెజారిటీతోనైనా సిటింగ్ సీటును నిలబెట్టుకుంటామన్న అంచనాలో ఉన్నారు. వాస్తవానికి బీఆర్‌ఎస్ మొదట్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపించినా.. పోలింగ్ వరకు వచ్చేసరికి ప్రచారంలోగానీ, పోల్ మేనేజ్‌మెంట్‌లో గానీ కాంగ్రె్‌సతో పోటీ పడలేకపోయింది. మాగంటి గోపీనాథ్ మరణంతో సెంటిమెంట్‌నే ప్రధానంగా నమ్ముకుని దిగిన బీఆర్‌ఎ్‌సకు.. పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు ఆ కుటుంబంలో తలెత్తిన వివాదం ఇబ్బందికరంగా మారింది.
బీజేపీ డీలా!
ఎగ్జిట్ పోల్స్ వెల్లడితో బీజేపీ డీలా పడింది. పార్టీ నేతలు, కార్యకర్తల్లోనూ ఒక రకమైన నిరుత్సాహం నెలకొందని అంటున్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తదితరులు విస్తృతంగా ప్రచారం చేసినా.. ఆశించిన ఫలితం దక్కదన్న అంచనాకు ఆ పార్టీ నేతలే వచ్చారు. సర్వే సంస్థలన్నీ బీజేపీ అభ్యర్థికి 8 శాతం కంటే తక్కువగానే ఓట్లు వస్తాయని స్పష్టం చేశాయి. 2023 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి 25,886 ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికలో ఆ మార్కును దాటి ఓట్లు సాధించడం అటుంచి.. అంతకన్నా తగ్గుతాయని సర్వే సంస్థలు తేల్చడం ఆ పార్టీ వర్గాలను కలవరపెడుతోంది. వాస్తవానికి 2023 ఎన్నికల్లో బీజేపీ గట్టిపోటీ ఇవ్వని చోట్ల ఆ పార్టీ సానుభూతిపరులు.. బీఆర్‌ఎ్‌సను ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ అభ్యర్థుల వైపు మొగ్గు చూపినట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం పార్టీ.. కాంగ్రెస్ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో గతంలో బీజేపీ వెంట ఉన్న ఓటర్లు ఈసారి బీఆర్‌ఎ్‌సకు మద్దతు పలికి ఉంటారన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి మెజారిటీ తగ్గితే.. అందుకు ఇదే కారణమవుతుందనీ అంటున్నారు.