Share News

Jubilee Hills By Election campaign: జూబ్లీహిల్స్‌లో ఊపందుకున్న కాంగ్రెస్‌ ప్రచారం

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:02 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం ఊపందుకుంటోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క...

Jubilee Hills By Election campaign: జూబ్లీహిల్స్‌లో ఊపందుకున్న కాంగ్రెస్‌ ప్రచారం

  • ఎనిమిదేళ్లు రేవంత్‌ రెడ్డే సీఎం: మంత్రి కోమటిరెడ్డి

  • నవీన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి: డిప్యూటీ సీఎం

  • వెంగళరావునగర్‌లో కాంగ్రెస్‌.. ఎర్రగడ్డలో సీపీఐ ఇంటింటి ప్రచారం

  • బీఆర్‌ఎస్‌, బీజేపీలను నమ్మి మోసపోవద్దు: శ్రీధర్‌బాబు

  • కాంగ్రెస్‌ హయాంలోనే పేదలకు ఇళ్లు: మీనాక్షి, మంత్రి పొన్నం

యూసు్‌ఫగూడ/ వెంగళరావు నగర్‌/ బంజారాహిల్స్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం ఊపందుకుంటోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సహా పలువురు మంత్రులు మంగళవారం ప్రచారం చేపట్టారు. రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని పీజేఆర్‌ టెంపుల్‌ వద్ద జరిగిన రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎనిమిదేళ్లపాటు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పేదల సంక్షేమానికి పని చేసే కాంగ్రెస్‌ పార్టీనే జూబ్లీహిల్స్‌ ప్రజలు ఆదరిస్తారన్నారు. పేరుకే జూబ్లీహిల్స్‌ అయినా ఇక్కడ పేదలే ఎక్కువగా నివసిస్తున్నారని చెప్పారు. ఫామ్‌ హౌస్‌ నుంచి బయటకు రాలేని కేసీఆర్‌ రెండేళ్లలో అధికారంలోకి వస్తారని కేటీఆర్‌ చెప్పడం అర్థరహితమని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టి రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ అప్పుల పాల్జేశారని, ఎస్‌ఎల్‌బీసీ వంటి మిగతా ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయాయో ఆ పార్టీ నేతలే చెప్పాలని డిమాండ్‌ చేశారు. మధురానగర్‌ కాలనీలో పార్టీ సీనియర్‌ నేత దేవిరెడ్డి నాగార్జున రెడ్డి కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వెంగళరావు నగర్‌ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం చేసిన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా, ట్రాఫిక్‌ రహిత రాజధానిగా మార్చేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఎర్రగడ్డ డివిజన్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. యూసు్‌ఫగూడ డివిజన్‌ హైలం కాలనీ, వెంకటగిరి ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌.. ఇంటింటా ప్రచారం చేస్తూ.. ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేస్తూ స్థానిక అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు ఓటేయాలని కోరారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్‌ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే పేదలకు ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇంటికి విద్యుత్‌ వెలుగులు వచ్చాయని చెప్పారు. శ్రీనగర్‌ కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్కులో వాకర్స్‌తో కలిసి రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రచారం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను శ్రీధర్‌ బాబు కోరారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యేలు మక్కన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌, బాలూ నాయక్‌, వేముల వీరేశం, రాందాస్‌ నాయక్‌, కూచుకుళ్ల రాజేశ్‌ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, అన్వేశ్‌ రెడ్డి, నాయుడు సత్యనారాయణ, దొండపాటి వెంకటేశ్వరరావు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 04:02 AM