BJP state president Ramchander Rao: కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుంది!
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:15 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు...
అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులతో పాటు తప్పుడు కేసులు పెట్టిస్తోంది
బీజేపీ నాయకుడు మధుకర్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
బాధ్యులైన పోలీసులనూ సస్పెండ్ చేయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
మధుకర్ కుటుంబానికి పరామర్శ
గోదావరిఖని/మంచిర్యాల, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి, వారు ఆందోళన చెందుతున్నారని.. అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు యేట మధుకర్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాను కలిసి రాంచందర్‌రావు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. ఆ పార్టీ మాజీ ఎంపీటీసీ మొదలు ఎమ్మెల్యేల వరకు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. వేమనపల్లిలో మధుకర్ వల్ల తాము ఓడిపోతామన్న భయంతో మాజీ జడ్పీటీసీ సంతోష్, గాలి మధు మరికొందరు అతనిపై నానా రకాలుగా ఒత్తిళ్లు తెచ్చారని చెప్పారు. చివరికి అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని, బాధితులకు అండగా నిలవాల్సిన ఎస్సై కోటేశ్వర్ ఇందుకు భిన్నంగా వ్యవహరించారని తెలిపారు. సీఐ బన్సీలాల్ సైతం కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతూ మధుకర్‌ను అవమానించాడన్నారు. పార్టీ కార్యకర్తలకు బీజేపీ అండగా ఉంటుందని, బెదిరింపులకు భయపడేది లేదని చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ప్రతీకారం తప్పదని రాంచందర్‌రావు హెచ్చరించారు. మధుకర్ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో పేరున్న రుద్రభట్ల సంతోష్, గాలి మధుతో పాటు 13 మందిని వెంటనే అరెస్టు చేయాలని, బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్‌చేశారు. చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగితే పార్టీ పక్షాన ఉద్యమిస్తామన్నారు.
బీజేపీ నేతల మధ్య వాగ్వాదం
నీల్వాయిలో మధుకర్ కుటుంబాన్ని రాంచందర్‌రావు పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న క్రమంలో అక్కడే ఉన్న వెంకటేశ్ నేత, గోమాసే శ్రీనివాస్ మధ్య వాగ్వాదం జరిగింది. రాంచందర్‌రావు పక్కనే వెంకటేశ్ నేత కూర్చోవడంతో అతడిని లేపి మృతుడి తండ్రిని కూర్చోబెట్టాలని శ్రీనివాస్ సూచించారు. ఈ క్రమంలో మాజీ ఎంపీని అరేయ్ వెంకటేశ్ అని పిలిచారు. స్పందించిన వెంకటేశ్.. ‘అరేయ్ ఒరేయ్ అంటే చెంప పగులుద్ది. నోర్మూసుకో’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగా శ్రీనివాస్.. ‘బట్టలు ఊడదీసి కొడతా’ అంటూ హెచ్చరించారు. ఒక దశలో కూర్చుని ఉన్న వెంకటేశ్.. శ్రీనివాస్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్ కల్పించుకుని ఇరువుర్ని శాంతింపజేశారు. రాంచందర్‌రావు సమక్షంలోనే ఇలా జరగడంతో పార్టీ నాయకులు, ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు.